Puttaparthi Issue : ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ మరింత హీట్ పెరిగిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న క్రమంలో మాటల యుద్దానికి తెరలేపుతూ వారి వారి శైలిలో దూసుకుపోతున్నారు. ఇన్నాళ్ళూ ఎక్కువ సందర్భాలలో మాటలు, తక్కువ సమయాల్లో మాత్రమే గొడవలు,దాడులు చేసుకోవడం గమనించవచ్చు. అయితే ఇప్పుడు పార్టీల కోసం ప్రజలు లైన్ దాటేస్తునానరని అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా గమనిస్తే రాజకీయ హత్యలు ఎన్ని జరిగాయో ఒక సారి పాత పేపర్లు తిరగేస్తే తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఆ పోకడ పూర్తిగా మారిపోతుందా డైరెక్ట్ గా కొట్టుకోవడానికి రెడీ అవుతూ .. పరస్పర దాడులకు దిగడం సామాన్య ప్రజలను సైతం భయబ్రాంతులకు గురి చేస్తుంది.
ప్రశాంతతకి మారుపేరుగా ఉండే సత్యసాయి ధామం పుట్టపర్తిలో రాజకీయ విభేదాలు ఇప్పుడు భగ్గుమన్నట్లు తెలుస్తుంది. పుట్టపర్తిలో రాజకీయ ఘర్షణలు చెలరేగి మాటల యుద్దం కాస్తా.. సవాళ్ళకు దారి తీసి చివరకి ఏకంగా రాళ్ళ దాడి చేసుకునేంత లాగా మారిపోయింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య పుట్టపర్తి అభివృద్ధి గురించి మొదలైన చర్చ.. సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ నాయకులు రోడ్లపైకి వచ్చేంతలా మారింది. దీంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వైకాపా – తెదేపా గోడవకు కారణం అదేనా (Puttaparthi Issue)..
పుట్టపర్తిని అభివృద్ధి చేసింది తామేనని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పల్లె వ్యాఖ్యలను ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తప్పుబట్టారు. తమ హయాం లోనే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దీంతో తేల్చుకుందామంటూ ఇద్దరు నాయకులు సవాల్ విసురుకున్నారు. దీనికి వేదికగా పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయాన్ని ఎంచుకున్నారు. అన్నట్టుగా మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తన అనుచరులతో సత్యమ్మ ఆలయానికి చేరుకున్నారు. అటు ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కారుపైకి ఎక్కిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తేల్చుకుందాం రండి అటూ తొడగొట్టి సవాల్ విసిరారు. అటు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
కాగా ఈ తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పల్లె వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు.. పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి రఘునాథరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో సత్యసాయి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సత్యమ్మ గుడి దగ్గర ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతించమని తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని నాయకులను కోరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు.. వి వాంట్ జస్టిస్.. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు.