Site icon Prime9

Andhra Pradesh: 8 వేలకు పైగా ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా అవకాశం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను అందుబాటులోకి తెస్తోంది. 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం 8 వేలకుపైగా పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనుంది.

3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు ఉండే ప్రీహైస్కూళ్లలో విద్యార్థులు నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే వాటిలోనూ సబ్జెక్టు టీచర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తారు. ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లలో హెడ్మాస్టర్ల నియామకం కోసం 1,000 వరకు ఎస్‌ఏ పోస్టులను గ్రేడ్‌–2 హెచ్‌ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన ఎస్‌ఏలకు వీటిలో పదోన్నతి కల్పిస్తారు. ఈమేరకు పదోన్నతుల విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరక్టర్‌ మువ్వా రామలింగం సర్క్యులర్‌ రూపంలో విడుదల చేశారు.

ఎస్‌ఏ, గ్రేడ్‌–2 హెడ్మాస్టర్‌ పోస్టులలో పదోన్నతులకు సంబంధించి జిల్లాలవారీగా సీనియార్టీ జాబితాలను ఈనెల 10వ తేదీలోగా రూపొందించాలని రీజినల్‌ జాయింట్‌ డైరక్టర్లు, జిల్లా విద్యాధికారులకు సూచించారు. ఇప్పటివరకు రకరకాలుగా అన్వయించి పదోన్నతులు చేపట్టడం న్యాయ వివాదాలకు దారి తీసినందున ఏకరూప నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేస్తూ సర్క్యులర్‌లో పొందుపరిచారు. ఎస్‌ఏ, హెడ్మాస్టర్‌ పోస్టులకు సంబంధించి నిబంధనలున్నాయని, అలాగే కొన్ని వర్గాలకు ఇతర అర్హతలను పరిగణలోకి తీసుకొని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar