Site icon Prime9

PM Modi Visakha Tour: ఏపీవాసుల రుణం తీర్చుకునేందుకే వచ్చా.. అభివృద్ధి పథంలో నిలుపుతాం

PM Modi Speech At Vishaka Public Meeting: భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖలో పర్యటించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐఎన్ఎస్ డేగకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతుండగా, సిరిపురం జంక్షన్ నుంచి సాగిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. పిదప, విశాఖ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు నేతలంతా హాజరయ్యారు.

ఆకట్టుకున్న రోడ్ షో..
ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షో‌కు విశాఖవాసులు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. బుధవారం విశాఖపట్నం చేరుకున్న ప్రధాని ఐఎన్ఎస్ డేగా నుంచి సిరిపురం జంక్షన్‌కు చేరుకుని, అక్కడ ఏర్పాటుచేసిన ఓపెన్ టాప్ వాహనంలో రోడ్ షో ప్రారంభించారు. ఈ వాహనంపై ప్రధానికి ఇరువైపులా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిలబడగా, ప్రధాని వెనక ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నిలబడ్డారు. కిలోమీటరున్నర మేర సాగిన ఈ రోడ్ షోలు.. ప్రజలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న బారికేడ్ల వెనక నిలిచి పూల వర్షం కురిపించారు. జనం సంతోషంతో పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా, వాహనంపై నుంచే నేతలంతా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

వేదికపై 13 మందికే అవకాశం
ప్రధాని బహిరంగ సభ వేదికపై కేవలం 13 మందికే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేష్‌, సత్యకుమార్, అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీలు ఎం.శ్రీభరత్, సీఎం రమేష్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వేదికపై ఆసీనులయ్యారు.

తెలుగులో మోదీ ప్రసంగం
ఈ సభలో నేతల ప్రసంగాల తర్వాత మాట్లాడిన ప్రధాని, తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా, ఏపీ ప్రజల ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలు తెలిపారు. సింహాచల లక్ష్మీనరసింహస్వామికి నమస్కరించారు. స్వతంత్ర భారత చరిత్రలో 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏపీ ప్రజల స్వాగతం, ఆశీర్వాదం చూశాక మనసు సంతోషంతో పొంగిపోయిందని, ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామన్నారు. 2047 నాటికి రెండున్నర ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఏపీని నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు.

పారిశ్రామిక వికాసం
అయితే 2030 వరకు ఐదు మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, దేశంలో రెండు గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఒకటి విశాఖ నగరానికి కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుందన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్‌ సిటీ భాగం అవుతుందన్నారు. నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో ఏపీ ప్రగతి పట్టాలెక్కుతుందని, లక్షల ఉద్యోగాలు వస్తాయని, దీంతో ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు.

ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది..
దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు పునాదిరాయి వేశామని, రాష్ట్ర అభివృద్ధిలో రైల్వేజోన్‌ కీలకం కానుందన్నారు. రైల్వేజోన్‌ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరటంతో బాటు వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, అమృత్‌ భారత్‌ కింద ఏపీలోని 70కిపైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ జరుగుతున్నాయన్నారు. విశాఖ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని, మత్స్యకారుల ప్రగతికి నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు.

చరిత్రలో నిలిచే రోజు: సీఎం
ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులు, క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు రావటం సంతోషమని సీఎం చంద్రబాబు అన్నారు. రూ.6,177 కోట్ల విలువైన 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రూ.5,718 కోట్లతో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగిందన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించామని, రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10వ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశామని, రూ.3,044 కోట్లతో 234 కిలోమీటర్ల పొడవైన 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేశామని, ఇది ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు అని సీఎం ప్రకటించారు.

భారత జాతి నిర్మాత… మోదీ
భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రజావేదిక బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఒక బలమైన భారత్ కోసం, ఒక ధృడమైన సంకల్పంతో ప్రధాని పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత 45 ఏళ్లుగా వసుధైవకుటుంబమనే భావనతో ప్రధాని పనిచేస్తున్నారని, ఈ ప్రయాణంలో తనకు ఎదురైన ప్రతి పరాజయాన్ని, అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు.

అభివృద్ధిలో ఏపీ నంబర్ 1
గత ఐదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రం ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రధాని ఏపీ వాసులకు అండగా నిలిచారని, అందుకే ఈ రోజు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి పనులు, ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. దీనికి ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. కేంద్రం సాయంతో, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఏపీ నంబర్ వన్ అవుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version