Nandamuri Balakrishna : నటసింహా నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. తనదైన శైలిలో దూసుకుపోతూ అటు హీరోగా.. ఇటు వ్యాఖ్యాతగా దుమ్ము దులుపుతున్నారు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ, నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక బాలయ్యకి పాటలు పాడే టాలెంట్ ఉందని తెలిసిన విషయమే. తన సినిమా ల్లోనూ ఆయన ఇప్పటికీ పలుమార్లు పాటలు పాడారు. పలు వేదికల మీద కూడా ఆయన సింగింగ్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇటీవల ‘వీర సింహారెడ్డి’ సక్సెస్ సెలబ్రేషన్స్ లోనూ ఆయన పాటలు పాడారు. అయితే బాలయ్యకు తన తండ్రి నందమూరి తారక రామారావు పౌరాణిక సినిమాల్లో పాటలు పాడటమంటే ఎక్కువ ఇష్టం అని పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు నందమూరి నటసింహం.
కేవలం పాడడమే కాకుండా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారంటే బాలయ్య ఏ లెవెల్లో అదరగొట్టారో అర్దం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నటించిన ‘జగదేక వీరుడి కథ’ సినిమాలో ఘంటసాల ఆలపించిన ‘శివ శంకరి’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఘంటసాల కెరీర్‌లో కష్టమైన పాటల్లో ఇదీ ఒకటి. ఈ పాటను తాజాగా బాలకృష్ణ పాడారు. ఎన్టీఆర్(సీనియర్) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖతార్‌లోని దోహాలో ఓ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్నారు బాలయ్య. ఇందులో ఆయన పాట పాడటం విశేషం. అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్ నటించిన శివశంకరీ పాటని అద్భుతంగా ఆలపించారు. ప్రొఫేషనల్ సింగర్ తరహాలో ఆయన పాట పాడటం విశేషం. బాలయ్య పాటకి అభిమానులు ఫిదా అయ్యారు. చప్పట్లతో మారు మోగడమే కాదు, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈసారి మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా (Nandamuri Balakrishna)..
ఇదిలా ఉంటే, బాలకృష్ణ ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్ లో 108వ సినిమాగా రాబోతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.