New Delhi: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో కంటోన్మెంట్ బిల్లు, మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బిల్లుతో సహా పలు బిల్లులు ప్రవేశ పెడతారు. ఈ సెషన్‌లో లోక్ సభ 18 రోజుల పాటు పనిచేయనుంది.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కౌంటింగ్ లాంటివి ఉండటం వల్ల, కేవలం 108 గంటల పాటు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. సభలో పాటించాల్సిన విధానాలు, మాట్లాడే మాటలకు, నిరసనలకు సంబంధించి పలు నిషేదాజ్జలను లోక్ సభ సెక్రటేరియట్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ సమావేశాల్లో తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న, గిరిజన విశ్వవిద్యాలయం, గతిశక్తి వర్సిటీ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న సెజ్‌ల స్థానంలో డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ సర్వీసెస్ హబ్స్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులున్నాయి. వివాదాస్పద అటవీ సంరక్షణ సవరణ బిల్లు కూడా ఇందులో ఉంది.
ఈ సమావేశాల్లో మొదట మాజీ ఎంపీలకు మృతికి సంతాపం తెలపనున్న ప్రకటిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సభ ప్రారంభం అవుతుంది. ఇంకోవైపు బీజేపీని ఇరుకున పెట్టేందుకు పార్లమెంట్ సమావేశాలను అస్త్రంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, అగ్నిపథ్, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం వంటి అంశాలను లేవనెత్తేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సి అంశాలపై కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చించారు.