Minister Talasani: కాంగ్రెస్ నేత.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని కోమటిరెడ్డి వ్యాఖ్యలను మంత్రి తలసాని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ కు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ అవసరం బీఆర్ఎస్ కు లేదని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. రాజకీయం వేడెక్కుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్
ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోనూ.. పొత్తులు పెట్టుకోదని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము.. సంపూర్ణ మెజార్టీ తో అధికారంలోకి వస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరిపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉందని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి తలసాని సవాల్ విసిరారు. ఎన్నో ఏళ్లుగా అంబర్ పేట్ కి ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్ రెడ్డి.. ఏం అభివృద్ధి చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. అంబర్ పేట్ అభివృద్ధిపై ఆ తమ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం చర్చకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ఇక ఈటల గురించి స్పందించిన మంత్రి తలసాని.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వచ్చేది ఆయన ఇష్టమని అన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇచ్చింది.. కానీ తమ సెక్రటేరియట్ ప్రారంభానికి ఇవ్వలేదని మంత్రి అన్నారు.
మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తుందో దేశం గమనిస్తుందని అన్నారు. సెక్రటేరియట్ ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సెక్రటేరియట్ గొప్పతనం భవిష్యత్ లో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం అంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి.. బీజేపీకి ఓట్లు వేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా అధికారం కోసం కలలు కంటున్నారని.. అవి అలాగే మిగిలిపోతాయని అన్నారు.