Mayor Vijayalakshmi: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే వీధి కుక్కలు ఆకలి వేయడంతోనే బాలుడిపై దాడి చేశాయంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆమె తొందరపాటు మాటలతో అపఖ్యాతి పాలైనప్పటికీ ఇప్పటికీ విజయలక్ష్మీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
తాజాగా మరోసారి అదే తరహా కామెంట్స్ చేశారామె. తనపై వచ్చిన విమర్శలపై మేయర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఎవరినో కుక్క కరిస్తే.. తానే కరవమన్నట్లు సృష్టించారన్నారు. ‘నేనేమైనా కరవమన్నానా’ అనే విధంగా విజయలక్ష్మీ వ్యాఖ్యానించారు.
జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నానని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, ఆడవాళ్లు బయటకు వస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చాలాసార్లు చెప్పానని విజయలక్ష్మి అన్నారు.
అంబర్‌పేట్‌లో బాలుడి మృతిపై జీహెచ్‌ఎంసీ అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. బాలుడి మృతి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో మేయర్ విజయలక్ష్మి అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా బాలుడి మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బాలుడిని చంపిన కుక్కలకు ప్రతిరోజూ ఓ మహిళ మాంసం పెట్టేదని..
ఆమె 2 రోజులుగా కనిపించకపోవడంతో ఆకలితో కుక్కలు బాలుడిపై దాడి చేశాయని విజయలక్ష్మీ అన్నారు.
దీంతో మేయర్‌పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ వ్యాఖ్యల వేడి కొనసాగుతోంది.
కాగా వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గైడ్ లైన్స్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని… కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలని పేర్కొంది.
మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని… అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది.