Site icon Prime9

Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీవర్ష సూచన

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు.

మరోవైపు వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వెంట అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తరువాత ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్​లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్​బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్​, నాంపల్లి, హిమాయత్​నగర్​, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఆరు జిల్లాలకు రెండ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.

Exit mobile version