Kiran Kumar Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, కాంగ్రెస్ సర్కారు గురించి, వైకాపా ప్రభుత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తెలంగాణకు విక్రయించడం లేదని అన్నారు. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద రూ.3,500 కోట్లు ఎవరు పెట్టుబడి పెడతారో వారిని కేంద్రం బిడ్డింగ్‌కి పిలవడం జరిగిందన్నారు. నష్టాల కారణంగా ఎయిరిండియాను విక్రయించినట్లు తెలిపిన నల్లారి.. అలాగే లాభాలు లేనందునే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ గురించి Kiran Kumar Reddy..
అదే విధంగా ఆంధ్రపదేశ్ విభజన సమయంలోనే కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు కావని చెప్పానని గుర్తుచేశారు. అందుకే తన సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు. కొత్త రాజధాని నిర్మించే నిధులు రావడం జరగదని ఆరోజే చెప్పానన్నారు. అధిష్ఠానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తాం అన్నారు.. వద్దని చెప్పా. నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్తపడాలి. కింద పడి పగిలాక నీళ్లను సీసాలో పోయలేమని చెప్పా. ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే భాజపాలో చేరా’’ అని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.
Kiran Kumar Reddy బీజేపీలో చేరడం గురించి..
తాను పదవి ఆశించి బీజేపీలో చేరలేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తనకు ఎవరు ఏ పదవి ఆశ చూపించలేదన్నారు. బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఇందులో చేరానన్నారు. ఏపీలో బీజే బలోపేతం కోసం పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రం లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని.. దాడులు చేసిన సంస్కృతి గతంలో లేదన్నారు. తాను ఏ ఒక్క రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదని.. అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకేలా ఉన్నయన్నారు. బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే తనది కూడా అదే అదే స్టాండ్ అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అమరావతి విషయంలో బీజేపీ నిర్ణయాలే తన నిర్ణయంగా పేర్కొన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఒక్కటేనని అన్నారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టానని.. తన జీవితమంతా అక్కడే గడిచిందని వ్యాఖ్యానించారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ నావే. హైదరాబాద్‌లో పుట్టా.. అక్కడే చదువుకున్నా.. అక్కడే ఉంటున్నా. నా తండ్రి సొంతూరు చిత్తూరు జిల్లా. వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. బెంగళూరులోనూ నాకు ఇల్లు ఉంది. కర్ణాటక కూడా నా స్వస్థలం అనొచ్చు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నివాసం ఉంటాను. పార్టీకి ఎక్కడ పనిచేయమంటే అక్కడ చేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయి. పదవులపై ఎవరితోనూ మాట్లాడలేదు. ఎన్నికల్లో టికెట్ ఆశించడం లేదు. నా పోటీపై తుదినిర్ణయం పార్టీ అధిష్ఠానానిదే. రాజధానిపై పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను అని కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పారు. అలానే తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లినప్పటి నుంచి తాను అతడి ఇంటికి వెళ్లలేదని తెలిపారు.