Jagapathi Babu Reacted on Sandhy Theatre Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి కుటుంబాన్ని నటుడు జగపతి బాబు పరామర్శించారు. అయితే తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న భారీ ఎత్తున బెన్‌ఫిట్ షో వేసిన సంగతి తెలిసిందే. సినిమా చూసేందుకు వచ్చిన రేవతి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మృతురాలి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక రాత్రి జైలులో ఉన్న అతడు బెయిలుపై బయటకు వచ్చాడు. దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటికి కదిలి వెళ్లి బన్నీ పరామర్శించారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆసెంబ్లీలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క పూట జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ పరామర్శించేందుకు సినీ పరిశ్రమ మొత్తం ఆయన ఇంటికి వెళ్లిందని, అదే బాధితుల కుటుంబాన్ని ఒక్కరైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు ఆస్పత్రికి వెళ్లి ఆ బాలుడిని చూసిందలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆయన చేసిన ఈ కామెంట్స్‌కి నటుడు జగపతి బాబు పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేస్తూ రేవతి కుటుంబాన్ని కలిసినట్టు చెప్పారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “సినిమా షూటింగ్ ముగించుకుని ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడికి వెళ్లాను.
— Jaggu Bhai (@IamJagguBhai) December 22, 2024
అందరి ఆశీస్సులతో త్వరగానే బాలుడు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చాను. ఈ ఘటనలో అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది ఈ కుటుంబమే. అందుకే నా వంతు సపోర్టుగా ఆ ఫ్యామిలీని కలిసి పరామర్శించారు. మానవత్వంగా మాత్రమే ఆ కటుంబాన్ని కలిసేందుకు వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఈ విషయం ఎవరికి తెలియదు. దానిపై క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను” అని చెప్పుకొచ్చారు. కాగా పుష్ప 2లో జగపతి బాబు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రతాప రెడ్డి పోలిటికల్ పార్టీ అధినేతగా ఆయన కనిపించారు. కనిపించింది కొన్ని క్షణాలే అయినా పవర్ఫుల్ పాత్రలో కనిపించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు.