ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో చరిత్రలో మరో ఘనత సాధించింది. తాజాగా శ్రీహరికోట వేదికగా చేపట్టిన ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. వన్ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్‌ను ప్రపంచం మొత్తానికి అందించే శాటిలైట్స్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపించింది. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి 36 ఉపగ్రహాలతో కూడిన సముదాయాన్ని ప్రత్యేకంగా రూపొందించిన లాంచ్ వెహికల్ మార్క్ త్రీ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
మూడు దశల్లో ఈ రాకెట్ నిర్ధీత కక్ష్యలోకి ప్రవేశించేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. మూడు దశలను దాటుకుని రాకెట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశ పెట్టింది. కాగా.. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఒక్కొటి 150 కిలోగ్రాముల బరువు ఉండే ఉపగ్రహాలను ఇస్రోకి చెందిన బాహుబలి రాకెట్ లో 12 విమానాల్లో నిక్షిప్తం చేశారు. అంతరిక్షంలోని వెళ్లిన తర్వాత ప్రతీ నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈ విమానాలు విడిపోయి ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాయి. భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఉపగ్రహాలు పనిచేయనున్నాయి. ఈ ప్రయోగం కోసం ఉపయోగించే లాంచ్ వెహికల్ పేరును GSLV జియోసింక్రనస్ లాంచ్ వెహికిల్ మార్క్ త్రీని లాంచ్ వెహికల్ మార్క్ త్రీగా మార్చారు.
ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేసి 36 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా నిర్దేశించిన సమయంలో నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేసి.. సక్సెస్ అయ్యారు. బ్రిటన్‌కు చెందిన వన్‌వెబ్ సంస్థతో ఇస్రో 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది అక్టోబర్ 23న 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో తాజాగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది.