Hyderabad Metro Rail:అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ మెట్రోపై కీలక ప్రకటన చేశారు. మెట్రో ధరలు పెంచితే ఊరుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
భట్టికి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మెట్రో (Hyderabad Metro) రైలు విషయంపై భట్టి పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ పార్టీనే మెట్రోను తీసుకువచ్చిందని భట్టి అన్నారు. మెట్రో ఛార్జీలను అగ్రిమెంట్‌కు విరుద్ధంగా పెంచారని.. మరింత పెంచే ఆలోచనలో మెట్రో అధికారులు ఉన్నట్లు తెలిపారు. మెట్రో లిమిటెడ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని భట్టి ఆరోపించారు. మెట్రో యాడ్స్ ఇచ్చే విషయంలో ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటికి బదులు ఇస్తూ.. కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
మెట్రో పూర్తి ఘనత మాదే..
కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వందే అన్నారు. మెట్రో రైలుకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదని.. అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ఇష్టారాజ్యంగా మెట్రో ఛార్జీలు పెంచే ఆలోచన లేదని.. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదని సభాముఖంగా తెలిపారు. కాంగ్రెస్ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే మెట్రోరైల్ నడుస్తుందని పేర్కొన్నారు. మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పూర్తిచేస్తామని కేటీఆర్ అన్నారు. మహానగర పాలక సంస్థ పరిధిలో, పరిసర ప్రాంతాలలో హైదరాబాదు మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించానికి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోందని సమాధానమిచ్చారు.
మెట్రో రైల్ విషయంలో కేంద్రం మెుండిచేయి..
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ కు కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదంటూ కేటీఆర్ Ktr విమర్శలు గుప్పించారు. చిన్న చిన్న నగరాలకు కేంద్రం సహకరిస్తున్న.. హైదరాబాద్ కు మెుండిచేయి చూపిస్తుందని ఆరోపించారు. మెట్రో రైలులో ప్రకటనలు ఉండాలనేది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అని.. అది కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో ఉద్యోగాలు లోకల్ వారికే ఇస్తామని.. భూసేకరణలో ఎటువంటి సమస్యలు లేవన్నారు.