Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోపై ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగారు. ఈ మేరకు తాజాగా రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోస్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమీర్ పేట, మియాపూర్, పలు మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని… వేతనాలు పెంచమంటే పట్టించుకోవడం లేదని సమ్మె చేపట్టిన టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఐదేళ్లలో అన్ని ధరలు పెరిగినా తమకు జీతాలు మాత్రం పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వేతనం రూ.15 వేల నుండి రూ.18 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ సందర్భంగా రసూలుపురా మెట్రో ఆఫీస్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ లైన్ లో టికెట్ కౌంటర్లలో సుమారు 300 మంది విధులు నిర్వహించాలి. కానీ ఇవాళ 150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. టికెట్ కౌంటర్లలో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.