Harirama Jogaiah : వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపిని ఓడించేందుకు టిడిపి నాలుగు మెట్లు దిగివచ్చి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తాజా రాజకీయాలపై జోగయ్య విశ్లేషణ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభకి స్వచ్ఛందంగా హాజరైన జనాన్ని చూస్తే వైఎస్‌ఆర్‌సిపిపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఎంతన్నది తేటతెల్లమవుతోందని జోగయ్య వివరించారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చెప్పకనే చెబుతున్నాయని జోగయ్య లేఖలో తెలిపారు. అయితే ఇదంతా తెలుగుదేశంపై ప్రజల్లో ఉన్న అభిమానం అనుకుని కలలు కనవద్దని జోగయ్య హితవు పలికారు.
జనసేన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉండేవని జోగయ్య విశ్లేషించారు. జనసేన పోటీ చేయకుండా టిడిపితో కలిసి ప్రయాణం చేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని గ్రహిస్తే మంచిదని జోగయ్య సూచించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనని కలుపుకుని ప్రయాణం చేయవలసి వస్తే తెలుగు దేశం పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా నాలుగు మెట్లు కిందికి దిగాలని జోగయ్య అన్నారు. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలన్న జనసైనికుల కోరికకి ఎటువంటి భంగం కలగకుండా టిడిపి ప్రణాళికలు రచించి అమలు చేయాలని జోగయ్య చెప్పారు. ఇలా చేస్తేనే వైఎస్‌ఆర్‌సిపిని ఓడించడం సాధ్యమవుతుందని జోగయ్య అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఏర్పాటు చేయడంతోపాటు ఏపీ భవిష్యత్‌ని తీర్చిదిద్దవచ్చని జోగయ్య సూచించారు.
చంద్రబాబు ముందుకు రాక తప్పదు – హరిరామ జోగయ్య (Harirama Jogaiah)
కాగా ఇటీవల జనసేన నిర్వహించిన కాపు సంక్షేమ సంఘం సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను గద్దె దించాలంటే పవన్‌ను సీఎం చేసేందుకు చంద్రబాబు ముందుకు రాక తప్పదని హరిరామ జోగయ్య అన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలని సూచించారు. లోకేష్‌ను అధికారంలో భాగస్వామిని చేయాలన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు పరిమితమైతేనే టీడీపీ-జనసేన మధ్య సయోధ్య సాధ్యమన్నారు. సయోధ్య లేకుంటే 2024 ప్రతిపక్షాల ఓట్లు చీలతాయని హరిరామ జోగయ్య అభిప్రాయ పడ్డారు. ఇదే జరిగితే 2024 తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతుందంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కాబోయే పవర్ కళ్యాణ్ అంటూ హరిరామ జోగయ్య చెప్పారు.
విపక్షాలు కలవాలని చంద్రబాబు అంటారని, కానీ రాజ్యాధికారం వారి చేతుల్లోనే పెట్టాలంటారని అన్నారు. వైసీపీ ఎన్ని వ్యూహాలు రచిస్తోందో.. టీడీపీ కూడా అన్ని రకాల వ్యూహాలు పన్నుతోందని ఆరోపించారు. కన్నా, మహాసేన రాజేష్ లాంటి వారిని జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. జనసేనను చంద్రబాబు వీకెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేవలం 20 సీట్లే జనసేనకు ఇస్తామంటూ చంద్రబాబు ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎలాంటి ఒప్పందం చేసుకున్నా తామంతా పవన్ వెంటే ఉంటామని హరిరామ జోగయ్య చెప్పారు. అయితే.. పవన్‌కి, కాపుల గౌరవానికి భంగం కలగరాదన్నారు. గౌరవం అంటే సీఎం పదవిలో కూర్చొబెట్టడమేనని స్పష్టతనిచ్చారు. ఎటువంటి మచ్చ లేని వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. ఎలాంటి సంకోచం లేకుండా వైసీపీ, టీడీపీలపై పవన్ యుద్దం ప్రకటించాలని సూచించారు.