Hyderabad Cricket Association : జింఖానాగ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులపై అజారుద్దీన్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ గురించి.. ఆలోచించి ఏర్పాట్లు చేయాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం వ్యవహారంలో హెచ్సీఏ తీరుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ హెచ్ సి ఎ పద్ధతి మార్చుకోకపోతే..స్టేడియానికి ఇచ్చిన స్థలం లీజు రద్దు చేస్తామన్నారు. ప్రభుత్వమే స్టేడియాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. టీ20 మ్యాచ్ టిక్కెట్ల అమ్మకంలో 40 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి. అజారుద్దీన్ వన్ మ్యాన్ షో వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ జరపాలని చెప్పారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్ సి ఎ దే అని.. తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేది లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని హెచ్ సి ఎ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు, సూచనలను పాటిస్తామన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తుండడంతో టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారని అన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసమే మేమందరం కష్టపడుతున్నామనితెలిపారు. టికెట్స్ అన్ని అమ్ముడు పోయాయని ఇవ్వాళ జరిగిన ఘటన పై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు అజారుద్దీన్. ఇవ్వాళ సికింద్రాబాద్ గ్రౌండ్ టికెట్ల అమ్మకం పై పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని ఎప్పుడూ నెగిటివ్ కోణంలో చూడొద్దని అన్నారు. ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమిచేయలేమని. బాధితులకు హెచ్ సి ఎ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్ ల నిర్వహణ ఉంటుందని వారు తెలిపారు.