Site icon Prime9

Google: గూగుల్ ఆఫీస్ కు బాంబు బెదిరింపు.. కలకలం సృష్టించిన ఫోన్ కాల్

Google

Google

Google: టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కార్యాలయంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్‌ కలకలం సృష్టించింది. మహారాష్ట్ర పుణెలోని గూగుల్‌ కార్యాలయానికి బెదిరింపు ఫోన్‌ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.

అనంతరం అది ఫేక్‌కాల్‌గా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్‌ నుంచి ఆ బెదిరింపు కాల్‌ వచ్చినట్టుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ లో నిందితుడి అరెస్టు( Google)

ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సులో ఉన్న గూగుల్‌ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం ఓ ఫోన్‌ వచ్చింది. పుణెలోని ముంధ్వా ప్రాంతంలో ఉన్న గూగుల్‌ ఆఫీస్ లో బాంబు ఉన్నట్లు సదరు వ్యక్తి చెప్పాడు. ఈ విషయంపై గూగుల్‌ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానిక పోలీసులతో పాటు బాంబు నిర్వీర్య బృందాలు అక్కడకు చేరుకొని తనిఖీలు చేశాయి.

చివరకు ఫేక్‌ కాల్‌గా ధ్రువీకరించిన పోలీసులు.. కాల్‌ చేసిన వ్యక్తిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఆ వ్యక్తి బెదిరింపునకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్ కు చెందిన పాణ్యం బాబు శివానంద్ అనే వ్యక్తి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు హైదరాబాద్ చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి కాల్ చేశాడని.. తదుపరి విచారణ కొనుసాగుతోందని చెప్పారు.

Exit mobile version