New Delhi: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాగాంధీకి తాజాగా సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 21న హాజరు కావాలని నోటీసులో కోరింది. కాగా ఈడీ సోనియాకు గాంధీకి ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈ నెల 22తో ముగియనుంది. ఇదిలా ఉండగా గత నెలలో ఈడీ జారీ చేసిన సమన్లను కొంత కాలం పాటు వాయిదా వేయాలని సోనియా కోరారు. కోవిడ్ -19తో పాటు లంగ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని ఈడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. సోనియా విన్నపాన్ని ఈడీ కూడా అంగీకరించింది. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి గత నెల 18వ తేదీన డిశ్చార్జి అయ్యారు. కోవిడితో పాటు అనారోగ్య సమస్యతో ఆమె గత నెల 12వ తేదీన ఆస్పత్రిలో చేరారు.
అంతకు ముందు సోనియాగాంధీని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి జూన్ 8వ తేదీన హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది. కాగా జూన్ 1వ తేదీన సోనియాగాంధీకి కరోనా సోకడంతో ఆమె ఆస్పత్రిలో చేరడంతో కొంత కాలం గడువు కోరారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా చేజక్కించుకున్నారని, వార్తా పత్రిక భూములు కాజేశారని స్వామి తల్లీ, కొడులకుపై ఆరోపణలు గుప్పించారు.