Site icon Prime9

Maharashtra CM: ‘మహా’ సీఎం పదవిపై ఉత్కంఠ! – సీఎం ఎవరంటే..

మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ఫలితాలు వెల్లడై రెండు వారాలు కావోస్తున్న ఇప్పటికీ సీఎం ఎవరనేది స్పష్టత రాలేదు. దీనిపై మహాయుతి కూటమి తర్జనభర్జన అవుతుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘మహా’ సీఎం ఎవరూ? అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనారోగ్యం కారణంగా ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే చర్చకు బ్రేక్‌ పడింది. ఈ క్రమంలో ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు కోసం సమావేశం కానున్నారు. శాఖల కేటాయింపులపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలను మహాయుతి కూటమి గెలుచుకుంది.

ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం..

ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం జరగనున్నది. ఇప్పటివరకు ఆ పీఠాన్ని ఎవరు ఎక్కనున్నారనే దానిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదు. దీనిపై స్పందించిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ

మహరాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ ఈ నెల 4న జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వారు ఢిల్లీకి వెళ్లనున్నారు.

పఢ్నవీసే సీఎం : మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. దేవేంద్ర ఫడ్నవిస్ తదుపరి ముఖ్యమంత్రి అని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగటివార్ ఎన్నికల ఫలితాల అనంతరం వ్యాఖ్యానించారు. అయితే, ఇది తన అభిప్రాయం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, అయితే భేటీలో పార్టీ నుంచి ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం ఉండదంటూ పరోక్షంగా ఫడ్నవీస్‌నే సీఎంగా ప్రకటిస్తారనే హింట్‌ ఇచ్చారు. ఫడ్నవిస్‌ను సీఎంగా నిర్ణయించే విషయంలో షిండేకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ముంగటివార్ పేర్కొన్నారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైందని, లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 3న సమావేశం ఉంటుందని మరో బీజేపీ నేత తెలిపారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే సైతం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version