Site icon Prime9

CWG 2022: బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్

CWG 2022: బ్రిటన్‎లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా, పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. అందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి.

రెజ్లింగ్​లోనూ పతకాల పంట పండిస్తున్నారు భారత కుస్తీ వీరులు. ఇప్పటికే ముగ్గురు భారత రెజ్లర్లు బజరంగ్​ పునియా, దీపక్​ పునియా, సాక్షి మాలిక్​ గోల్డ్​ మెడల్స్​ సాధించగా, శనివారం భారత్​ను మరో నాలుగు స్వర్ణాలు వరించాయి. పురుషుల ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో రవి దహియా, 74 కిలోల విభాగంలో నవీన్​ బంగారు పతకం సాధించారు. మహిళల రెజ్లింగ్​లో కూడా భారత్​కు మరో స్వర్ణం దక్కింది. 53 కేజీల విభాగం ఫైనల్​లో వినేశ్​ ఫొగాట్​ గెలుపొందింది. రెజ్లింగ్​లో భారత్​కు ఇది ఐదో స్వర్ణం కావడం విశేషం. ఫొగాట్​కు కామన్వెల్త్​ గేమ్స్​లో ఇది వరుసగా మూడో పసిడి పతకం. ఇలా కామన్వెల్త్​ గేమ్స్​లో వరుసగా మూడో గోల్డ్​లు సాధించిన తొలి భారత మహిళ కావడం విశేషం. అథ్లెటిక్స్ లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ పసిడి పతకం గెలవగా, భారత్ కు చెందిన అబూబకర్ కు ఇదే క్రీడాంశంలో రజతం దక్కింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో కూడా మరో పతకం ఖాయమైంది. భారత ఆశాకిరణం లక్ష్యసేన్ కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్ కు తెలంగాణ ప్రభుత్వం అభినందనలు తెలిపింది. తెలంగాణ బిడ్డ గోల్డ్ మెడల్ సాధించినందుకు సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భవిష్యత్తుతో నిఖత్ జరీన్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Exit mobile version