Cm Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది. విజయనగరం జిల్లాలో 3,500 కోట్ల ఖర్చుతో 2,200 ఎకరాల్లో ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించబోతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులకు ఇవాళ సీఎం జగన్ అంకురార్పణ చేయనుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇప్పటికే భోగాపురం చేరుకున్న సీఎం విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనం భారీగా సభకు తరలి వచ్చారు. అలానే అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ అదానీ కూడా పాల్గొనననున్నారు. మధురవాడలో 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్‌లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతోపాటు తారకరామ తీర్ధ సాగరం పనులకు రూ.194.40 కోట్లతో శంకుస్థాపన, 23.73 కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.
దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. అయితే.. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రతిపాదించిన ఘనత తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.