Site icon Prime9

BRS Party : నేడు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ … దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా ?

cm kcr opening brs party central office at delhi

cm kcr opening brs party central office at delhi

BRS Party : రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మారుస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పార్టీ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్.

ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 12 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య శుభ ముహూర్తాన్ని పండితులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఆ సమయానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి ఆఫీస్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులను కేసీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం అందుతుంది.

ఈ కార్యక్రమానికి కర్నాటక మాజీ సీఎం కుమార‌స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. పంజాబ్, హ‌ర్యానా, యూపీ, ఒడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన రైతు నేతలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. ఈ తరుణంలోనే గత రెండు రోజులుగా ఢిల్లీ లోనే ఉన్న కేసీఆర్ పార్టీ ఆఫీస్‌ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఋత్విక్కులు గణపతి పూజ, పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు.

కాగా ఈరోజు నవ చండీహోమం, రాజశ్యామల హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను చేయనున్నారు. అయితే ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు తాజాగా ప్రకటించారు. పలువురు పార్టీ అధినేతలతో చర్చలు జరిపిన కేసీఆర్ మరి దేశ రాజకీయాల్లో ఏ విధంగా దూసుకుపోతారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కేసీఆర్ మరి చక్రం తిప్పుతారా ? లేదా ? అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు !

Exit mobile version