Site icon Prime9

Cm Ys Jagan : మార్కాపురంలో ఈబీసీ నేస్తం పథకం నిధులను విడుదల చేసిన సీఎం జగన్..

cm jagan speech at markapuram ebc scheme money transfer details

cm jagan speech at markapuram ebc scheme money transfer details

Cm Ys Jagan : ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఈబీసీ నేస్తం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ  రెండేళ్లలో  వైఎస్ఆర్  ఈబీసీ  నేస్తం  ద్వారా  రూ. 1258 కోట్లు  జమ  చేసినట్టుగా  సీఎం  జగన్  చెప్పారు. రాష్ట్రంలోని  మహిళలకు  భరోసా  ఇచ్చేందుకు  తమ ప్రభుత్వం  అనేక  కార్యక్రమాలు  చేపట్టినట్టుగా  సీఎం జగన్  తెలిపారు. ఎన్ని కష్టాలున్నా  కూడా  చిరువవ్వుతో  కుటుంబాన్ని  నడిపిస్తున్న  గొప్ప వ్యక్తులు  మహిళలు అని  సీఎం జగన్  చెప్పారు. తమది  మహిళల  పక్షపాత  ప్రభుత్వమన్నారు. కుటుంబ బాధ్యతలను చిరునవ్వుతో నిర్వహించే అక్కాచెల్లెమ్మలకు సెల్యూట్ చేస్తున్నానని, ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అనేక పథకాలను తీసుకొచ్చామని వివరించారు. పేదరికానికి కులంలేదని, అగ్రవర్ణాల్లోని పేద మహిళలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని చెప్పారు. ఇందుకోసమే రాష్ట్రంలో ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం కింద అగ్రవర్ణాల పేద మహిళలకు మూడేళ్ల పాటు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని తెలిపారు.

తల్లి కడుపులో ఉన్న శిశువు నుంచి 60 నుంచి వందేళ్ల వరకు ఉన్న అవ్వల దాకా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేసుకుంటూ వచ్చిందని జగన్ చెప్పారు. సంపూర్ణ పోషణ నుంచి పెన్షన్ వరకు మహిళలకు అందజేస్తున్నట్లు సీఎం గుర్తుచేశారు. ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఓసీ పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 4,39,068 మంది పేద మహిళలకు రెండో విడతగా రూ.658.60 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్ధతిలో నేరుగా నా అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేస్తామని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే మన ప్రభుత్వం రాష్ట్రంలోని పేదవాళ్ల బ్యాంకు ఖాతాలలో 2,07,000 కోట్ల రూపాయలు నేరుగా జమచేసిందని జగన్ చెప్పారు. ఇందులో అక్షరాలా 1,42,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్కాచెల్లెమ్మల ఖాతాలకే చేరిందని సీఎం చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ పథకం ద్వారా అక్షరాలా 41,77,000 వేలమంది మహిళలకు ఆర్థిక సాయం అందించినట్లు జగన్ పేర్కొన్నారు. వితంతువులు, దివ్యాంగ మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు తోడ్పడ్డామని ముఖ్యమంత్రి వివరించారు.

సెల్ఫీ ఛాలెంజ్ గురించి నోరు విప్పిన జగన్ (Cm Ys Jagan)..

గతంలో  ఓ ముసలాయన  సీఎంగా  ఉండేవాడని  చంద్రబాబుపై  జగన్  సెటైర్లు వేశారు.  చంద్రబాబు  సీఎంగా  ఉన్న సమయంలో  ఇలాంటి  పథకాలు  ఉన్నాయా  అని  ఏపీ సీఎం  జగన్  ప్రశ్నించారు.  చంద్రబాబు  సర్కార్ లో దోచుకో, పంచుకో తినుకో  అనేది  చంద్రబాబు  విధానమని  ఆయన  విమర్శించారు. ముసలాయన  పాలనలో  ఒక్క   రూపాయి  మీ  ఖాతాలో  వేశారా  అని ఆయన  విమర్శించారు. ఎలాంటి వివక్ష, అవినీతి  లేకుండా  తమ  ప్రభుత్వం  అర్హులకు  పథకాలు అందిస్తుందని సీఎం జగన్  చెప్పారు.

సెల్ఫీ చాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫొటోలు కాదని, పేదవాడి ఇంటి ముందు నిలబడి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలని జగన్ అన్నారు. దానికి ఆ కుటుంబం కూడా చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దానిని సెల్ఫీ అంటారు.. దానినే గొప్ప సెల్ఫీ అంటారని వివరించారు. ఈ విధంగా మీ ప్రభుత్వ హయాంలో చేసిన పనిని పేదవాడి ఇంటిముందు నిలబడి చెప్పగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. మార్కాపురంలో జరిగిన ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా, ఏ గ్రామాన్ని తీసుకున్నా గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అని, మనందరి ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలో జరిగిన మంచి ఎంత అని అడిగి తెలుసుకోవాలని జగన్ చెప్పారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని, ఈ నాలుగేళ్ల మా పాలనలో జరిగిన మంచిని బేరీజు వేసుకుని చూసే సత్తా నీకు ఉందా బాబూ? అని అడుగుతున్నానని, చాలెంజ్ అంటే ఇదే అని జగన్ తెలిపారు. ఎవరి హయాంలో ఏం జరిగిందని, మేలు చేసే ప్రభుత్వం ఏదనేది ప్రజలకు తెలుసని జగన్ పేర్కొన్నారు.

 

Exit mobile version