Site icon Prime9

Bihar: కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే డీఎస్పీగా ఎంపికయిన బిహార్ మహిళ

Bihar woman selected as DSP while working as a constable

Bihar woman selected as DSP while working as a constable

Bihar: ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.

బిహార్​లోని బెగుసరాయ్​ జిల్లాకు చెందిన బబ్లీ అందరిలానే ఓ సాధారణ మహిళ. తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె అయిన ఆమె ఇంటికి పెద్ద దిక్కు కావాలనుకుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించి 2015లో పోలీస్ కానిస్టేబుల్​ ఉద్యోగం సాధించింది. బిహర్‌లోని ఖగారియా జిల్లాలో ఖాకీ దుస్తులు ధరించి విధుల్లో చేరింది. తర్వాత బెగుసరాయ్‌కు ట్రాన్స్ ఫర్ అయింది. నెలనెలా జీతంతో ఆమె కుటుంబ ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడింది. అయితే అంతటితో ఆగలేదు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కలలుకంది. ఆ కలలను సాకారం చేసుకునేందుకు బిహార్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ( బీపీఎస్‌సీ)పరీక్షలు రాయలనుకుంది. పోలీస్ స్టేషన్​లో విధులు, ఇంటి పనులు.. ఇలా అన్నీ పూర్తయ్యాక మిగిలిన కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలకు ప్రిపేరయింది.

బీపీఎస్‌సీ పరీక్షలు రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. ప్రస్తుతం బిహార్​లోని బెగుసరాయ్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న బబ్లీ బీపీఎస్‌సీలో క్వాలిఫై అయినందున రాజ్​గిర్​ ట్రైనింగ్​ సెంటర్​లో శిక్షణ తీసుకోనుంది. శిక్షణ కాలం ముగిసిన తర్వాత ఆమె బిహర్​ పోలీస్​ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్​గా బాధ్యతలు చేపట్టనుంది. బబ్లీ కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను బెగుసరాయ్ ఎస్​పీ యోగేంద్ర కుమార్ సన్మానించారు. కానిస్టేబుల్​గా పనిచేస్తూనే బీపీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని కొనియాడారు. తనకు అండగా ఉండి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు బబ్లీ కృతజ్ఞతలు తెలిపింది.

Exit mobile version