Sai Srinivas: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ హీరో – వధువు ఎవరంటే..

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 04:21 PM IST

Bellamkonda Sai Srinivas Marriage Update: టాలీవుడ్‌లో వరుసగా వెడ్డింగ్ బెల్స్‌ మోగుతున్నాయి. ఈ ఏడాది చాలా మంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవల నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇక అక్కినేని హీరో, యువ సామ్రాట్‌ నాగచైతన్య నేడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మరికొన్ని గంటల్లో నటి శోభిత దూళిపాళ మెడలో మూడుమూళ్లు వేయనున్నాడు. వచ్చే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్‌ కూడా పెళ్లి బంధంలోకి అడుపెట్టనున్నాడు. అయితే ప్రస్తుతం అంతా చై పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మరో టాలీవుడ్‌ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. అతడే బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్‌.

త్వరలోనే ఈ యంగ్ హీరో బ్యాచీలర్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తెలిపారు. నిర్మాతగా 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన ఇద్దరు కొడులకు (సాయి శ్రీనివాస్‌, గణేష్‌)ల సినిమాలు, పెళ్లిపై విలేఖర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి ప్రాజెక్ట్స్‌ చెప్పిన ఆయన కొడుకుల పెళ్లిపై స్పందించారు. “సాయి శ్రీనివాస్‌ పెళ్లి మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇక గణేష్‌ పెళ్లికి ఇంకా టైం ఉంది. వచ్చే ఏడాదిలో సాయి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇండస్ట్రీకి అసలు సంబంధం లేని అమ్మాయితో సాయి శ్రీనివాస్‌ పెళ్లి జరుగుతుంది. త్వరలోనే పెళ్లిపై ప్రకటన ఇస్తాం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి.

కాగా సాయి శ్రీనివాస్‌కు ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు అనే చెప్పాలి. అల్లుడు శ్రీను చిత్రంలో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అతడు తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. దీంతో అతడు స్టార్‌ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో హిందీ మార్కెట్‌పై కన్నేశాడు. తన డబ్బింగ్‌ చిత్రాలకు అక్కడ మంచి ఆదరణ రావడంలో ప్రభాస్‌ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్‌ చేశాడు. భారీ అంచనాలు మధ్య తెరకెక్కి విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాస్తా గ్యాప్‌ తీసుకుని తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌ సైన్ చేశాడు. అందులో భైరవం, టైసన్ నాయుడు చిత్రాలతో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల భైరవం నుంచి అతడి లుక్‌ రిలీజ్‌ అవ్వగా దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక టైసన్ నాయుడు మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.