Ap Mlc Elections : ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎక్కడెక్కడ ఎవరి పరిస్థితి ఎలా ఉందంటే (Ap Mlc Elections)..?
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌పై ఆయన 20,310 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తెదేపా అభ్యర్థికి 58,957, వైకాపా అభ్యర్థికి 38,647, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 23,575, భాజపా అభ్యర్థి పీవీఎన్ మాధవ్‌కు 6,928 ఓట్లు వచ్చాయి. మొత్తం 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. మరో మూడు రౌండ్లు ఇంకా లెక్కించాల్సి ఉంది.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెదేపా సత్తా చాటుతోంది. అక్కడ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో శ్రీకాంత్‌కు 49,173 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి 39,615 ఓట్లు పడ్డాయి.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి.
మరోవైపు అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపరిచి అభ్యర్థి రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలిచారు. మూడో ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలిచినట్లు ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్ ప్రకటించారు.
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లెక్కింపు కూడా పూర్తయింది. అక్కడ వైకాపా మద్దతు తెలిపిన అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి సుమారు 2వేల ఆధిక్యంతో గెలుపొందారు.