AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్‌లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. తొలిదశలో రూ.11,498 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. విశాఖలోని మెట్రో రైలు ప్రాజెక్ట్ కింద రెండోదశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67కి.మీల మేర నాలుగో కారిడార్‌గా నిర్మించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్‌కు ఆమోదం..
మరోవైపు, విజయవాడ మెట్రో రైలు డీపీఆర్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు దశల్లో (కారిడార్ 1ఎ, 1బిగా) మొత్తంగా 38.4కి.మీ మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను మెట్రో రైలు కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా, ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తంగా రూ.11,009 కోట్ల మేర కారిడార్ 1ఎ, బి నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భూసేకరణ కోసం రూ.1152 కోట్లు
భూసేకరణ కోసం రూ.1152 కోట్లు ప్రభుత్వం భరించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్‌ను దాదాపు 27.75కి.మీల మేర నిర్మించాలని భావిస్తున్నారు. 1ఎ కారిడార్‌లో భాగంగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ వరకు, 1బిలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్‌ను రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు.