Site icon Prime9

Anushka Sharma: నటి అనుష్క శర్మకు షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు

Anushka Sharma

Anushka Sharma

Anushka Sharma: సేల్స్ ట్యాక్స్ వివాదంలో నటి, ప్రముఖ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. సేల్స్ ట్యాక్స్ వ్యవహారంలో అనుష్క శర్మ వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. పన్నుకు సంబంధించిన నోటీసులపై అప్పీల్ చేసుకునేందుకు తనకు ఇంకో అవకాశం ఉందని.. దానిని ఉపయోగించుకోవాలని హైకోర్టు సూచించింది.

అసలేంటీ ఈ కేసు?(Anushka Sharma)

2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు అనుష్క శర్మ కట్టాల్సిన అమ్మకపు పన్ను చెల్లించాలని సేల్స్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ నోటీసులు పంపారు. అయితే ఆ నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క శర్మ బాంబే హైకోర్టులో పిటిషన్ లో దాఖలు చేశారు. పలు సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ ప్రదర్శనలను ఇస్తానని, అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె పిటిషన్ లో ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ ఎవరైనా నటిస్తే వాళ్లు నటులు మాత్రమే అవుతారని, నిర్మాతలు అవ్వరని ఆమె తెలిపారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

అయితే అనుష్క వివరణను సేల్స్‌ ట్యాక్స్ విభాగం ఖండించింది. తన వీడియోల కాపీరైట్స్‌కు అనుష్కనే మొదటి ఓనర్ అని, నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్ల నుంచి కొంత మొత్తం తీసుకుని ఆ కాపీరైట్‌ను ఆమె వారికి బదిలీ చేశారని తెలిపింది. చట్ట ప్రకారం ఇది విక్రయం కిందకే వస్తుంది కాబట్టి పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఆమెదేనని పేర్కొంటూ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

అనుష్క పిటిషన్లను కొట్టివేత

ఈ పిటిషన్లపై బాంబే హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన తర్వాత.. అనుష్క దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు డివిజన్‌ బెంచ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ‘మహారాష్ట్ర వ్యాల్యూ యాడెట్‌ టాక్స్ చట్టం (MVAT)ప్రకారం.. పిటిషనర్‌ కు అందిన నోటీసులపై అప్పీల్‌ చేసుకునేందుకు ఆమె ప్రత్యామ్నాయ అవకాశముంది. అలాంటప్పుడు ఈ పిటిషన్లను మేం విచారించాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నించింది. 4 వారాల్లోగా ఆమె డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ సేల్స్‌ ట్యాక్స్‌ ముందు అప్పీల్‌ చేసుకోవాలి. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలన్నింటిపై అప్పీలేట్‌ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కరిస్తుంది. ఇప్పుడు ఈ పిటిషన్లను మేం విచారిస్తే.. MVAT చట్టం కింద ఉన్న అన్ని సమస్యలు ఇక్కడకే వస్తాయి’అని కోర్టు తెలిపింది. MVAT చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తన నోటీసులపై అప్పీల్‌ చేయాలనుకుంటే.. సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం విధించిన పన్ను మొత్తంలో 10 శాతం డబ్బును డిపార్ట్‌మెంట్‌కు జమ చేయాల్సి ఉంటుంది.

ఎంత బకాయిలంటే..

2012-13, 2013-14, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బకాయి ఉన్న పన్ను చెల్లించాలని సేల్స్‌ ట్యాక్స్ విభాగం… అనుష్కకు నోటీసులు పంపింది. 2012-13 మదింపు సంవత్సరానికి రూ.1.2 కోట్లు, 2013-14 సంవత్సరానికి రూ. 1.6 కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మిగతా రెండు సంవత్సరాలకు ఎంత బకాయి అనేది స్పష్టత లేదు.

 

Exit mobile version