Bangladesh Protests: శ్రీలంక బాటలో బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం.దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 08:30 PM IST

Prime9Special: బంగ్లాదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్‌ ధరలు ఏకంగా 50 శాతం పెంచేసింది ప్రభుత్వం. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరగడంతో భారత్ తో పాటు శ్రీలంకలో కూడా ఇటీవల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చూశాం. పెరిగిన ధరలకు నిరసనగా బంగ్లాదేశ్‌లో ప్రజల పెట్రోల్‌ స్టేషన్‌ల చుట్టూ చేరి పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గత శుక్రవారం నాడు షేక్‌ హసీనా ప్రభుత్వం డిజిల్‌పై లీటరుకు 34 టాకాలు,పెట్రోల్‌పై లీటరుకు 44 టాకాలను పెంచేసింది. ఈ లెక్కన చూస్తే పెట్రోల్‌, డిజిల్‌ ధరలు లీటరుకు 51.7 శాతం పెరిగినట్లు బంగ్లాదేశ్‌ మీడియా పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెరగడం ఇదే మొదటిసారని బంగ్లా మీడియా స్పష్టం చేస్తోంది.

ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థలో బంగ్లదేశ్‌ ఒకటి. దీని జీడీపీ 416 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. అయితే పెరిగిపోతున్న ఇంధన ధరలు ఆహార ధరలు, దిగుమతుల బిల్లులతో ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నాడు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం దోచుకుంటుటోందని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డిజిల్‌ ధరలు పెచండంతో బస్‌ ఆపరేటర్లు బస్సు చార్జీలు పెంచేశారు. దీంతో మూలిగే నక్కపైకి తాటి పండు పడ్డచందంగా సామాన్యుడు ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ప్రభుత్వ వాదనం మరోలా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పెరిగినందు వల్ల దిగుమతి బిల్లు పెరిగిపోతోంది బంగ్లాదేశ్‌ ఎనర్జీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రభుత్వరంగానికి చెందిన బంగ్లాదేశ్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ జులైతో ముగిసిన ఆరు నెలల కాలానికి పెట్రోల్‌, డిజల్‌ అమ్మకాల ద్వారా సుమారు 85 మిలియన్‌ డాలర్లు నష్టపోయిందని వివరణ ఇస్తోంది. అయితే పెరిగిన పెట్రోల్‌ ధరలపై ప్రజలు భగ్గుమంటున్న విషయం తమకు తెలుసునని, అయితే తమకు ప్రత్యామ్నాయం లేదు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఇంధన శాఖ మంత్రి నస్రుల్‌ హమీద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌ ద్రవ్యోల్బణం వరుసగా గత తొమ్మిది నెలల నుంచి ఆరు శాతంపైనే నమోదవుతోంది. అయితే జులై నెలలో ఏకంగా 7.48 శాతానికి ఎగబాకింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులకు మరింత పెరిగాయి.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డాకాలోని నేషనల్‌ మ్యూజియం ముందు స్టూడెంట్స్‌ యూనియన్‌లు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఐఎంఎఫ్‌ నుంచి 4.5 బిలియన్‌ డాలర్ల రుణానికి దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ మారకద్రవ్యం నిల్వలు సరపడా ఉన్నాయని చెబుతున్నారు. ముందుచూపుతో కొంత రుణం తీసుకుని దిగుమతుల బిల్లుకు వినియోగించుకోవాలనుకుంటున్నామని చెబుతున్నారు. శ్రీలంక, పాకిస్తాన్‌తో పోల్చుకుంటే తమ పరిస్థితి మెరుగ్గానే ఉందని అన్నారు. మొత్తానికి బంగ్లాదేశ్‌ పరిస్థితి చూస్తుంటే త్వరలోనే శ్రీలంక సరసన చేరబోతుందా అన్న అనుమానాలు కలగక మానవు.