Actress Samyuktha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్.
రానాకి భార్య పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
దీంతో ఆమెకు అటు తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
2016లో పాప్ కార్న్ అనే తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది ఈ భామ.
అయితే ఈ చిత్రం పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం బాగానే వరించాయి.
కాగా ప్రస్తుతం సంయుక్త నటిస్తున్న చిత్రం “సార్”. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది.
తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్ టైం మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నెల 17 వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సంయుక్త మీనన్ వద్దు.. సంయుక్త చాలు (Actress Samyuktha)..
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్త మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి, తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.
ఇకపై తనను సంయుక్త అని మాత్రమే పిలవాలని.. తన పేరు పక్కనే ఉన్న తన తండ్రి ఇంటి పేరును తొలగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
నా సోషల్ మీడియా ఖాతాలు.. నేను నటించే సినిమాల్లోనూ సంయుక్త గానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇందుకు గల కారణాల గురించి మాట్లాడుతూ.. నా పేరు పక్కన మా నాన్న ఇంటి పేరు తీసేయ్యాలని చాలా కాలం క్రితం నుంచి అనుకుంటున్నాను.
నటికి ఉండాల్సిన బాధ్యతలు గ్రహించిన తర్వాత ఇంటిపేరును కొనసాగించకూడదని అనుకుంటున్నాను.
అంతే కాకుండా.. చాలా కాలం క్రితమే నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
మా నాన్న ఇంటి పేరును కొనసాగించడం అమ్మకు ఇష్టంలేదు.
నా తల్లి భావాలను గౌరవించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను.
మన చుట్టూ సమానత్వం, మానవత్వం, ప్రేమ చూడాలనుకున్నప్పుడు ఇంటిపేరును ఉంచుకోవడం అనేది నేను కోరుకుంటున్నవాటికి విరుద్ధంగా ఉంటుంది.
నేనెప్పటికీ నా తల్లి భావాలను గౌరవిస్తాను. ఇప్పటివరకు నా కెరీర్ మొదలైన నాటి నుంచి విభిన్నమైన పాత్రలు చేస్తున్నా.. ఇప్పుడు సార్ చిత్రంలోనూ నా పాత్ర అందర్నీ అలరిస్తుంది అని తెలిపింది.
నా పాత్రకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.
చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కొన్నాను.
అందుకే ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నాకు కష్టంగా అనిపించలేదు అని అన్నారు.
ప్రస్తుతం సంయుక్త చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అలానే ఈ సినిమాలో హైపర్ ఆది, పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.