Intermediate Students : పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్థాపంతో ప్రతియేటా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలను మనం గమనించవచ్చు. క్షణికావేశంలో పరీక్షలో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని ఈ లోకాన్ని వీడుతున్నారు విద్యార్దులు. తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు వారికి తగినంత మేర విద్యార్ధులను ప్రోత్సహించి.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నప్పటికి ఈ విషాద ఘటనలను అడ్డుకోలేకపోతున్నారు. కాగా ఈ ఏడాది కూడా తాజాగా ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తీర్ణత కాలేదని, మార్కులు తక్కువగా వచ్చాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్సశా పొందుతున్నారు. దీంతో వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మృతి చెందిన వారి వివరాలు..
1. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన విద్యార్థిని అనూష (17) కర్ణాటకలోని తన అమ్మమ్మ ఊరికి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఇంటర్ చదువుతుండగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యింది. అదే విషయాన్ని బుధవారం నాడు విద్యార్థిని తల్లి ఫోన్ చేసి ఆమెకు తెలిపింది. మరో రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి ఈసారి ఉత్తీర్ణత సాధిస్తానని తల్లితో కూడా ఆరోజు బాగానే చెప్పింది. కానీ మనస్తాపానికి గురైన అనూష గురువారం ఉదయం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
2. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు (17) ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఈయర్‌లో గణితం సబ్జెక్టులో ఉత్తీర్ణత కాలేదు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
3. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే ఆవేదనతో అనకాపల్లికి చెందిన కరుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల చిన్నకుమారుడు కరుబోతు తులసీ కిరణ్(17) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
4. పరీక్షలో తప్పానని మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్(17).. టెక్కలిలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి బలవన్మరణం చెందాడు.
5. విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కూలి పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తోంది. మృతదేహాన్ని గోప్యంగా శ్మశాన వాటికకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
6. విశాఖ నగరంలోని పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న బోనెల జగదీష్(18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒక సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత కాకపోవడంత మనస్తాపానికి గురై గురువారం ఉదయం గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
7. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేష్(17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. బుధవారం ఫలితాలు విడుదల కావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
8. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్ జాన్ సైదా(16)కు గణితంలో ఒక్కటి, ఫిజిక్స్‌లో ఆరు, కెమిస్ట్రీలో ఏడు మార్కులు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
9. అదే జిల్లాలోని చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ సీనియర్ ఇంటర్‌లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న వారి వివరాలు..
విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ కలిపి మూడు సబ్జెక్టులు తప్పాడు. మనస్తాపానికి గురైన అతను పురుగు మందు తాగాడు. బంధు మిత్రులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అలానే ఇదే జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యానని గురువారం చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.