Margadarsi Case : రామోజీ సంస్థల అథినేత రామోజీ రావుకు ఏపీ సీఐడీ ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు హోమ్ శాఖ సీఐడీని అనుమతించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిట్టీలు వేసిన చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చెల్లించే స్థితిలో లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం 1999 ప్రకారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయస్థానం అనుమతితో చరాస్తుల జప్తునకు సీఐడీ అధికారులు చర్యలు చేపట్టనున్నా రు. ఇదే విషయాన్ని వివరిస్తూ 50 బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు కూడా సమాచారం అందించారు. బ్యాంకులు, ఇతర సంస్థల్లోని నిధుల ను మార్గదర్శి మళ్లించకుండా, డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో 37 బ్రాంచ్‌ల్లో మార్గదర్శి వ్యాపారాలు చేస్తోంది. 1989 చిట్స్ గ్రూప్స్ ఉన్నాయి. తెలంగాణలో 2,316 గ్రూప్స్ నడుస్తున్నాయి అని సీఐడీ పేర్కొంది.
కాగా చిట్ ఫండ్స్ (Margadarsi Case) రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతో పాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. చిట్స్ ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో పలు మార్లు ఆ సంస్థ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఐపీసీ 120(బి), 409, 420, 477(ఏ), రెడ్ విత 34కింద ఏడు ఎఫ్‌ఐఆర్లు నమోదు చేసింది. ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1999లో సెక్షన్ 5తోపాటు చిట్ ఫండ్ యాక్ట్ 1982లోని 76,79సెక్షన్ల ప్రకారం సోదాలు చేసింది. మార్గదర్శి మేనేజర్లను అరెస్టు చేసింది. రామోజీరావు, శైలజాకిరణ్‌ను ప్రశ్నించింది. దీంతో గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కొత్త చిట్టీలు నిలిపివేసింది. ఆరు నెలల్లో దాదాపు రూ.400 కోట్ల విలువైన టర్నోవర్ నిలిచిపోయింది.