Corrupt Countries: ప్రపంచవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో డెన్మార్క్ అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 39 స్కోరుతో మొత్తం 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత అవినీతి, అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితా తాజాగా విడుదలైంది.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా 2023 కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ -సీపీఐ ను విడుదల చేసింది. సీపీఐ గ్లోబల్ సగటు వరుసగా 12వ ఏడాది కూడా 43 వద్ద ఎలాంటి మార్పు కనిపించలేదు. రెండింట మూడొంతుల దేశాలు 50 లోపే స్కోర్ చేశాయి.ప్రభుత్వ రంగంలో చోటుచేసుకున్న అవినీతి ఆధారంగా మొత్తం 180 దేశాలు, భూభాగాల్లో సీపీఐ అవినీతి స్థాయిని అధ్యయనం చేసింది.అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాల విషయానికి వస్తే ఈ జాబితాలో డెన్మార్క్ వరుసగా ఆరో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. సీపీఐ ఇండెక్స్‌లో దానికి 90 స్కోరు లభించింది. ఆ దేశంలో అద్భుతమైన న్యాయవ్యవస్థ ఉందని నివేదికలో ప్రశంసించింది. ఫిన్లాండ్ 87, న్యూజిలాండ్ 85 స్కోర్లతో వరుసగా రెండుమూడు స్థానాల్లో నిలిచాయి. ఇక, ఆ తర్వాతి స్థానాల్లో నార్వే 84, సింగపూర్ 83, స్వీడన్ 82, స్విట్జర్లాండ్ 82, నెదర్లాండ్స్ 79, జర్మనీ 78, లగ్జంబర్గ్ 78 చోటు దక్కించుకున్నాయి.
ఇక అత్యంత అవినీతి దేశాల విషయానికి వస్తే సోమాలియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. 11 స్కోరుతో అగ్రస్థానం చేరుకోగా, ఆ తర్వాత వరుసగా వెనిజులా 13, సిరియా 13, సౌత్ సూడాన్ 13, యెమెన్ 16గా నిలిచాయి. ఈ దేశాలన్నీ దీర్ఘకాలంగా సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతుండడం, సాయుధ పోరాటాలతో నిత్యం అల్లకల్లోలంగా ఉండడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక పేర్కొంది. 172వ ర్యాంకుతో ఉత్తర కొరియా అత్యంత అవినీతి దేశాలలో ఒకటిగా నిలిచింది.
ఇక ఇండియా స్కోర్ విషయానికి వస్తే… సీపీఐ ఇండెక్స్ 2023 నివేదికలో భారతదేశం 39 స్కోరుతో 93వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే భారత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదని నివేదికలో వెల్లడించింది. 2022లో ఇండియా ఓవరాల్ స్కోర్ 40 కాగా, 85వ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్ 29, శ్రీలంక 34 ర్యాంకులతో ఉన్నాయి. ప్రపంచబ్యాంక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ప్రైవేట్ రిస్క్, కన్సెల్టింగ్ కంపెనీలు, థింక్ ట్యాంకులు సహా మరో 13 ఇతర వనరుల నుంచి డేటాను సేకరించి ట్రాన్స్‌పరెన్స్ ఇంటర్నేషనల్ ఈ నివేదికను విడుదల చేసింది.