Site icon Prime9

Israel-Hamas war: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ డిప్యూటీ లీడర్‌ సలేహ్‌ అల్‌ అరౌరీ హతం

Saleh al-Arouri

Saleh al-Arouri

Israel-Hamas war: పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.

24 గంటల్లో 70 మంది మృతి..(Israel-Hamas war)

ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్‌కు బీరూట్ కేంద్రంగా ఉంది. బీరూట్‌ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా ఖరారు చేసింది. లెబనీస్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్‌ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.హమాస్ సైనిక విభాగం వ్యవస్థాపకులలో ఒకరైన అరౌరీ వెస్ట్ బ్యాంక్‌లో గ్రూప్ ఉనికికి నాయకత్వం వహించారు. అక్టోబర్ 7న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అతడిని చంపేస్తానని బెదిరించారు.

గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22వేల185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది మరణించారు.

Exit mobile version