Pakistan Economic system: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 3.5 శాతంగా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.
దిగుమతులకు చెల్లింపులు చేయలేక..(Pakistan Economic system)
గత ఏడాది ఆగస్టులో భారీ వరదల కారణంగా దేశం మూడొంతులు నీట మునిగిపోయింది. దీంతో పాటు ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల విదేశీ మారకద్రవ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నిత్యావసర వస్తువులు ఉదాహరణకు ఆహారం, ఇంధనం, ఎరువులు, మందులు వాటికి చెల్లించడానికి కూడా విదేశీ మారకద్రవ్యం లేదా డాలర్లు లేకుండా పోయాయి. దేశంలోని పారిశ్రామికరంగం కుంటుపడింది. మార్చి 2023తో ముగిసిన ఏడాది కాలానికి పారిశ్రామిక ఉత్పత్తి 25 శాతం క్షీణించిందని వరల్డ్ బ్యాంకు మంగళవారం నాడు విడుదల చేసిన తాజా గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్టులో పేర్కొంది.
అత్యధిక స్దాయికి ద్రవ్యోల్బణం..
స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు అడుగంటాయి, విదేశాల నుంచి రావాల్సిన రెమిటెన్స్ కూడా దాదాపు స్తంభించిపోయింది. ప్రభుత్వం ఎక్స్చేంజీ రేట్ ఫ్లెక్సిబిలిటీని పెంచింది. దీంతో పాకిస్తాన్ కరెన్సీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 20 శాతం క్షీణించిందని నివేదికలో వివరించింది. కరెన్సీ విలువ పడిపోవడంతో వెంటనే ద్రవ్యోల్బణం కూడా శరవేగంగా పెరిగిపోయింది. ఈ ఏడాది మే నెలలోనే 38 శాతానికి ద్రవ్యోల్బణం చేరింది. చివరగా 1970 దశకం చివర్లో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదైంది. దేశ ఆర్థికవ్యవస్థ దివాలా తీయడానికి సిద్దంగా ఉన్న క్రమంలో దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతోంది. . దేశంలో రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం కలబోసి ఈ ఆర్థిక సంవత్సరం పాక్ జీడీపీ 0.4 శాతంగా నమోదు కావచ్చు.కాగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి జీడీపీ వృద్దిరేటును 1.6 శాతం తగ్గించుకుంటూ వచ్చింది. చివరకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 0.3 శాతంగా నమోదు కావచ్చునని అంచనాకు వచ్చింది.
రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థగాడిన పడే అవకాశాల్లేవు. వృద్దిరేటు రెండు నుంచి మూడు శాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం వరద బాధితులను ఆదుకొనే అవకాశాలు కూడా మృగ్యమే అని ప్రపంచబ్యాంకు నివేదికలో వెల్లడించింది. దక్షిణాసియా దేశాలు గత రెండు దశాబ్దాల నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా గాడినపడే పరిస్థితి లేదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.