Tesla Robot: టెస్లా యొక్క గిగా టెక్సాస్ కర్మాగారంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పై ఒక రోబో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీర్ కొత్తగా వేసిన అల్యూమినియం ముక్కల నుండి కారు భాగాలను కత్తిరించే పనిలో ఉన్న రోబోలను పర్యవేక్షించడానికి సాఫ్ట్‌వేర్‌ను కోడింగ్ చేస్తున్నాడు.
రోబో యాక్టివేట్ గా ఉండటంతో..( Tesla Robot)
ఇంజనీర్ మరియు సిబ్బంది నిర్వహణను అనుమతించడం కోసం రెండు రోబోట్‌లు ఉద్దేశపూర్వకంగా నిలిపివేయబడ్డాయి, అయితే మూడవ రోబో విషయాన్ని మరిచిపోయి అలాగే వదిలేసారు. అల్యూమినియం కారు భాగాలను హ్యాండిల్ చేయడానికి రూపొందించిన ఈ రోబో ఇంజనీర్ పై దాడికి దిగింది. ఇంజనీర్ ను గట్టిగా అదిమిపెట్టడంతో దాని మెటల్ గోళ్లు ఇంజనీర్ వీపులో దిగబడ్డాయి. అతని చేతికి కూడా గాయమయింది. దీనితో ఫ్లోర్ మొత్తం రక్తసిక్తమయిందని సాక్షులు చెప్పారు. ఈ దాడిలో ఇంజనీర్ ఎడమ చేతికి గాయమైంది, అయితే తీవ్రంగా గాయపడినప్పటికీ , అతను పనికి విరామం తీసుకోలేదని తెలిసింది.
యూఎస్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (OSHA)కి సమర్పించిన గాయం నివేదికలు గత సంవత్సరం దాదాపు 21 మంది కార్మికులలో ఒకరు గాయపడినట్లు తెలిపాయి. ప్రస్తుత మరియు మాజీ టెస్లా కార్మికులు సంస్థ తరచుగా నిర్మాణం, నిర్వహణ మరియు కార్యకలాపాలపై రాజీ పడుతుందని, ఉద్యోగులను ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించారు.