Russia: రష్యాలో వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో రొస్తోవ్ నగరం నుంచి తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఎట్టకేలకు కనిపించారు. సోమవారంనాడు ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించారు దీనిపై ఆ దేశ రక్షణ శాఖ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో షోయిగు ఓ హెలికాప్టర్‌లో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని రష్యా సైనికుల ఆధీనంలో ఉన్న ఓ స్థావరానికి చేరుకొన్నారు. అక్కడ అధికారులతో పలు విషయాలపై మాట్లాడినట్లు అందులో ఉంది. ఈ మేరకు రష్యా రక్షణశాఖ ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. షోయిగు ఎక్కడికి వెళుతున్నారు, ఎప్పుడు వెళ్లారు.. అనే వివరాలను మాత్రం అందులో పేర్కొనలేదు. కేవలం ఆ వీడియో పోస్ట్ లో ఉక్రెయిన్‌లోని సరిహద్దు కమాండ్ పోస్టు అని మాత్రం క్యాప్షన్ ఇచ్చారు.
షోయిగు సరే ప్రిగోజిన్ జాడ ఏడి(Russia)
ఈ వీడియోలో షోయిగు ‘‘శత్రువుల ప్రణాళికలను బట్టబయలు చేసేందుకు గానూ నిఘా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించాలి’’ అని అక్కడి సీనియర్ కమాండర్లను ఆదేశించారు. ఈ సమయంలో ఆయన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ఊసే ఎత్తలేదు. నిజానికి వాగ్నర్ గ్రూప్ రొస్తోవ్ నగరాన్ని ఆక్రమించిన తర్వాత షోయిగు ఎక్కడున్నదనేది ఎవరికీ తెలియదు. మరోవైపు వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ తిరుగుబాటు అనంతరం బెలారస్ బయలుదేరారు. కానీ అతని జాడ కూడా తెలియడంలేదు. అతడు తమ దేశానికి చేరుకొన్నాడా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించలేమని బెలారస్ అధికారులు అంటున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆగడంలేదు. రష్యాలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నా.. ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం మాస్కో వైపు నుంచి భారీ సంఖ్యలో ఉక్రెయిన్ పై క్షిపణులను ప్రయోగించారని కీవ్ వర్గాలు వెల్లడించాయి. రెండు కల్బిర్ క్షిపణులు, ఏడు షాహిద్ డ్రోన్లు, నాలుగు మానవ రహిత విమానాలను తమ సైనిక దళాలు కూల్చివేసినట్టు ఉక్రెయిన్ పేర్కొనింది.