Russia Attacked Ukraine: ఉక్రెయిన్‌పై సోమవారం రాత్రి భారీ ఎత్తున క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా ఇతర నగరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల దెబ్బకు రాత్రి మొత్తం ఉక్రెయిన్ నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. పోలాండ్ సరిహద్దుల్లోని ల్వీవ్ నగరంలోని కీలక భవనాలు ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం. మాస్కో తమ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, వ్యవసాయ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు తమ రాజధాని కీవ్‌పై జరిగిన డ్రోన్ దాడులను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకొందని ఉక్రెయిన్ పేర్కొంది.
రష్యా కొన్ని టన్నుల టీఎన్‌టీ (పేలుడు పదార్థం) నింపిన ఓ ట్రక్కును ఉక్రెయిన్ సైనికులపైకి వదిలి రిమోట్ సాయంతో పేల్చేసింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖకు చెందిన ఓ టెలిగ్రామ్ ఛానల్‌లో వెల్లడించారు. ఈ ట్రక్కులో 3.5 టన్నులకుపైగా టీఎన్‌టీని నింపి ఐదు ఎఫ్‌ఏబీ-100 బాంబులను అమర్చారు. సాధారణంగా ఒక ఎఫ్‌ఏబీ-100 బాంబులో 100 కిలోల పేలుడు పదార్థం ఉంటుంది. దీని గురించి ఓ రష్యా కమాండర్ వివరించారు. ‘‘శత్రువుకు 300 మీటర్ల దూరంలో ట్యాంకును వారిపైకి మళ్లించి.. మా సైనికుడు దూకేసి వెనక్కి వచ్చేశాడు. ఆ వాహనం వారి వద్దకు వెళ్లాక రేడియో కంట్రోల్ సాయంతో నేను దానిని పేల్చివేశాను’’ అని పేర్కొన్నాడు.
ఆ ట్యాంకులో టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు ఉండటంతో భారీగా విస్ఫోటం సంభవించి షాక్‌వేవ్ పుట్టుకొచ్చింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ సేనలు భారీ నష్టాన్ని చవిచూసినట్లు రష్యా వెల్లడించింది. ఈ దాడి మొత్తాన్ని డ్రోన్ సాయంతో రష్యన్లు చిత్రీకరించారు. మరో రష్యా వార్ బ్లాగర్ మాత్రం.. సదరు ట్యాంకు ఉక్రెయిన్ సైనికుల వద్దకు చేరక ముందే ఓ మందుపాతరపైకి వెళ్లి పేలిపోయిందని వెల్లడించాడు. ఈ దాడి మరింకాలోని ఉక్రెయిన్ స్థావరంపై జరిగిందని తెలిపాడు.