Iran President Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు రైసీ

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్‌కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. నిన్న వాతావరణ అనుకూలించక హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 02:57 PM IST

Iran President Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్‌కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. నిన్న వాతావరణ అనుకూలించక హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ ఆచూకి కోసం నిన్నటి నుంచి.. రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించడంతో.. కాసేపటి క్రితం ఆచూకి లభ్యం అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయినట్టు తెలుస్తోంది.

ఇరాన్‌ ప్రభుత్వానికి చెందిన మీడియా ఇర్నా కూడా వాతావరణం అనుకూలింకపోవడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. అయితే రైసీ మాత్రం అమెరికా తయారు చేసిన బెల్‌ 212 హెలికాప్టర్‌లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ రెయిసీ మృతికి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాప దినాలుగా ప్రకటించారు.ఇదిలా ఉండగా ఇరాన్‌ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా మహ్మద్‌ ముఖ్బేర్‌ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌ ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ముఖ్బేర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇరాన్‌ రాజ్యాంగం ప్రకారం ఒక వేళ ప్రెసిడెంట్‌ చనిపోతే ఆయన స్థానంలో వైస్‌ ప్రెసిడెంట్‌ తాత్కాలికంగా ప్రెసిడెంట్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.

50 రోజుల్లో ఎన్నికలు..(Iran President Ebrahim Raisi)

ప్రెసిడెంట్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందినకారణంగా 50 రోజుల్లో కొత్త ప్రెసిడెంట్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 68 ఏళ్ల ముఖ్బేర్‌ విషయానికి వస్తే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడన్నటాక్‌ వినిపిస్తోంది. అయితే ఇరాన్‌ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమించాలనేది ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా 2021లో రెయిసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత ముఖ్బేర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనారు.