Site icon Prime9

Queen Elizabeth II: ఈ నెల 19న క్వీన్‌ ఎలిజబెత్‌ -2 అంత్యక్రియలు

Queen-Elizabeth-II-s-Funeral

London: బ్రిటన్‌ రాణి క్వీన్‌ఎలిజబెత్‌- 2 అంత్యక్రియలు భారీ స్థాయిలో నిర్వహించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పంపగా, దాదాపు 500 మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. కానీ, ఈ కార్యక్రమానికి మూడు దేశాలను మాత్రం ఆహ్వానించలేదు. ఉక్రెయిన్‌ పై భీకర యుద్ధం చేస్తోన్న రష్యా, మాస్కోకు సన్నిహితంగా ఉండే బెలారస్‌ తో పాటు మయన్మార్‌ దేశాల ప్రతినిధులను మాత్రం ఆహ్వానించలేదని ప్రభుత్వం ఉన్నతాధికారులు తెలియజేశారు.

క్వీన్‌ ఎలిజబెత్ 2 అంత్యక్రియలను ఈ నెల 19న భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1965లో విన్‌స్టన్‌ చర్చిల్‌ మరణానంతరం ఈ స్థాయిలో చేస్తున్న కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, రాజులు, రాణులు కలిపి మొత్తంగా 500 మంది వీఐపీలు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే, అధికారికంగా నిర్వహిస్తున్న అంత్యక్రియలకు రష్యా, బెలారస్‌, మయన్మార్‌లకు బ్రిటన్‌ ఆహ్వానం పంపలేదు. ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తోన్న కారణంతో రష్యాను, అందుకు పూర్తిగా సహకరిస్తోన్న బెలారస్‌ను ఇందుకు పిలవలేదని తెలుస్తోంది. మరోవైపు మయన్మార్​లో అక్కడి సైన్యం తిరుగుబాటు చేసి అధికారం చేపట్టడం వంటి కారణాలతో ఆయా దేశాలతో బ్రిటన్‌ దౌత్య సంబంధాలు కొనసాగించేందుకు సుముఖంగా లేనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇకపోతే, రాణి ఎలిజబెత్‌ అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, న్యూజిలాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, జర్మనీ అధ్యక్షుడు స్టెయిన్మియర్‌లు హాజరవుతున్నట్లు ఇప్పటికే ఖరారయ్యింది. బెల్జియం, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌ దేశాల రాజులు, రాణులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఇలా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే అతిథులతో లండన్‌లోని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ ఆదివారం సాయంత్రం సమావేశమవుతారు. సోమవారం ఉదయం వెస్ట్‌మినిస్టర్‌ అబ్బే నుంచి విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌ వరకు క్వీన్‌ ఎలిజబెత్‌ -2 అంతిమయాత్ర కొనసాగనుంది.

Exit mobile version