Pneumonia outbreak in Pakistan: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడువారాల్లో 200 మందికి పైగా పిల్లలు న్యుమోనియా తో మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పంజాబ్ కేర్‌టేకర్ ప్రభుత్వం మరణించిన పిల్లలలో చాలా మంది న్యుమోనియాకు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
శీతల వాతావరణం నేపధ్యంలో జనవరి 31 వరకు ప్రావిన్స్‌లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహించడంపై ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.జనవరి 1 నుండి, ప్రావిన్స్‌లో మొత్తం 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. మొత్తం 220 మరణాలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో నమోదవడం గమనార్హం. పంజాబ్ ప్రావిన్షియల్ రాజధాని లాహోర్‌లో 47 మరణాలు సంభవించాయి.పంజాబ్‌లోని ఇమ్యునైజేషన్‌ప్రోగ్రామ్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌లోని శిశువులు సాధారణంగా పుట్టిన ఆరు వారాల తర్వాత పిసివి అని పిలువబడే వారి మొదటి యాంటీ-న్యుమోనియా వ్యాక్సిన్ వేస్తారని చెప్పారు. ఇది శిశువు పుట్టినప్పటి నుండి రెండు సంవత్సరాల వయస్సు వరకు వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా శిశువుకు రోగనిరోధక శక్తిని అందిస్తుందని చెప్పారు. టీకాలు తీసుకున్న పిల్లలు బాక్టీరియా సంక్రమణకు దూరంగా ఉంటారని అన్నారు. న్యుమోనియా బారిన పడకుండా పిల్లలను రక్షించేందుకు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీనియర్ వైద్యులను కోరింది.పిల్లలు న్యుమోనియా బారిన పడకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, వెచ్చని బట్టలు ధరించాలని ప్రభుత్వం సూచించింది.