PM Modi: కాప్ 28 వాతావరణ సదస్సులో $475 మిలియన్ల ‘లాస్ అండ్ డ్యామేజ్’ ఫండ్‌ను అమలు చేయాలన్న యూఏఈ అధ్యక్షుడి ‘చారిత్రక’ నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన కాప్28 సదస్సు కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
2028లో జరగాల్సిన కాప్33 సదస్సును భారత్‌లో నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు.అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య అద్భుతమైన సమతుల్యతను భారత్.. ఈ ప్రపంచానికి చూపించింది. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో 17శాతం భారత జనాభానే. కానీ, కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా కేవలం 4శాతమే అని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. సంపన్న దేశాలు తమ సాంకేతికతను బదిలీ చేయాలని మోదీ కోరారు.
‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ ప్రోగ్రామ్..(PM Modi)
పర్యావరణ మార్పులను ఎదుర్కోవడం కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉంది. అందుకే 2028లో ఈ కాప్-33 సదస్సును భారత్‌లో నిర్వహించాలని ఈ వేదిక మీద ప్రతిపాదిస్తున్నా’’ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించే ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించారు. ప్రకృతి విషయంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించేందుకు గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులు, స్థానిక సంస్థల పర్యావరణ హితమైన చర్యలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. పర్యావరణ స్థిరత్వం కోసం పాటు పడేవారికి అదనపు వనరులు సమీకరించడంలో కేంద్రం సహకారం అందించనుంది. కాప్ 28 సదస్సు రెండు వారాల పాటు జరగనుంది. వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పల్గొంటున్నారు.