International Yoga Day 2023: ప్రపంచమంతా నేడు 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరుపుకుంటోంది. అమెరికా అధ్యక్షుడ్ జో బిడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది” అని ప్రధాని మోడీ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
పలు దేశాల్లో సైతం యోగా దినోత్సవానికి సంబంధించి ఆయా దేశాలు ఏర్పాట్లు చేశాయి. ఇటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అంతా యోగా డేను జరుపుకుంటున్నారు. పార్కుల్లో.. పలు స్టేడియాల్లో యోగా దినోత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇంటర్నేషనల్ యోగా డే ప్రాముఖ్యత (International Yoga Day 2023)
ఇకపోతే ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యోగాతో అనేక ప్రయోజనాలున్నాయని విశ్వసిస్తూ శారీరక, మానసిక వ్యాధులను నయం చేసే గొప్ప శక్తి యోగాకు ఉందని పేర్కొనింది. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా అని యూఎన్ఓ పేర్కొనింది.
భారత ప్రభుత్వం 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీన్ని 175 దేశాలు ఆమోదించాయి. ఇక అదే సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. యోగా అనేది వ్యాయామ సాధనల సమాహారం. ఆధ్యాత్మికతకు మరో రూపం. మోక్షసాధనలో భాగమని చాలా మంది విశ్వసిస్తారు.