Site icon Prime9

Pakistan: నూతన సంవత్సరం వేడుకలకు దూరంగా పాకిస్తాన్ .. ఎందుకో తెలుసా?

Pakistan

Pakistan

 Pakistan:నూతన సంవత్సరం సంబరాలకు దూరంగా ఉండాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిక ప్రధాన కారణం గాజా పై ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్‌ మరోసారి మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే గాజా ప్రజలకు సంఘీభావంగా ఈసారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.

న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం..( Pakistan)

ఈ మేరకు న్యూ ఇయర్‌ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్‌ హక్‌ కాకర్‌ ప్రకటించారు. గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని కాకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాలస్తీనాలో తీవ్రమైన యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విపత్కర సమయంలో పాలస్తీనా సోదరులు, సోదరీమణులకు సంఘీభావంగా.. ఈ సారి నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపకుండా నిషేధం విధిస్తున్నాం అని ప్రకటించారు. యుద్ధంతో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే తాము రెండుసార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామని తెలిపారు.

గత కొంతకాలంగా పాక్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా అక్కడ నూతన సంవత్సర వేడుకలను కూడా ఆర్భాటంగా చేయరు. ఒకవేళ చేసినా కొన్ని గ్రూప్‌లు బలవంతంగా వాటిని అడ్డుకున్న ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాని ప్రకటన.. పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంపై పాక్‌ వైఖరి మరోసారి స్పష్టమైంది.

ఇదిలా ఉండగాఇటీవల ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంక్షోభంపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రెండు దేశాల విధానం ఇజ్రాయెల్‌కు సమ్మతం కాకపోతే ఏక దేశ విధానమే పరిష్కారంగా కనపడుతోంది. అక్కడే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు సమాన హక్కులు పంచుకుంటూ సామరస్యంగా జీవించాలి’ అని అల్వీ మాట్లాడినట్లు గతంలో అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు రావడంతో అధ్యక్షుడి కార్యాలయం మరో ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది.

Exit mobile version