Pakistan passports: పాకిస్థాన్ పౌరులు లామినేషన్ పేపర్ కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ & పాస్‌పోర్ట్స్ (DGI&P) ప్రకారం, పాస్‌పోర్ట్‌లలో ఉపయోగించే లామినేషన్ పేపర్ ఫ్రాన్స్ నుండి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దాని కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లు నిలిచిపోయాయి.
నిలిచిపోయిన విదేశీ ప్రయాణాలు..(Pakistan passports)
దీనితో పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఆందోళన చెందుతున్నారు. విద్య, వైద్యం, వృత్తిపరమైన లేదా విశ్రాంతి ప్రయోజనాల కోసం చేసే విదేశీ ప్రయాణాయాలు నిలిచిపోయాయి. అనేక మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందారు. వారు అక్కడ రిపోర్టు చేయవలసిన సమయాలు దగ్గర పడుతున్నాయి. ఈ సంక్షోభానికి పాకిస్తాన్ ప్రభుత్వ అసమర్థత కారణమని వారు ఆరోపించారు.పెషావర్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో గతంలో రోజుకు 3,000 నుండి 4,000 పాస్‌పోర్ట్‌లు జారీ చేసేవారు. అయితే ప్రస్తుతం రోజుకు 12 నుంచి 13 పాస్ పోర్టులు మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో రెండు నెలలు ఇదే పరిస్దితి కొనసాగుతుందని వారు అంటున్నారు.
ఇలాఉండగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా డైరెక్టర్ జనరల్ ఖాదిర్ యార్ తివానా దీనిపై మాట్లాడుతూ పాస్‌పోర్ట్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని అన్నారు. పరిస్థితి త్వరలో అదుపులో ఉంటుంది. పాస్‌పోర్టుల జారీ మామూలుగానే కొనసాగుతుందని హామీ ఇచ్చారు.