Pakistan: అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టకపోతే, పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం వారిని దశలవారీగా బహిష్కరించడం ప్రారంభిస్తుందని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ సోమవారం తెలిపారు. అక్రమ వలసదారుల తొలగింపునకు పాకిస్థాన్ ఈ నెల అక్టోబర్ 31 తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది.
మూడు రోజుల్లో ఇరవైవేలమంది..(Pakistan)
గత మూడు రోజులుగా 20,000 మంది అక్రమ విదేశీయులు స్వచ్ఛందంగా పాకిస్థాన్‌ను విడిచిపెట్టినట్లు బుగ్తీ ధృవీకరించారు. అక్రమ విదేశీయులపై ఆపరేషన్‌లో అన్ని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనికోసం డివిజన్ మరియు జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. అక్రమ విదేశీ పౌరుల బహిష్కరణను దశలవారీగా నిర్వహిస్తామని, ప్రయాణ పత్రాలు లేని వ్యక్తులను మొదటి దశలో బహిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం జియో-మ్యాపింగ్‌ను పూర్తి చేసింది.అక్రమ విదేశీ పౌరులు ఎక్కడ ఉన్నా వారిని గుర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత అక్రమ విదేశీయులను ఉంచడానికి తాము హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.అక్రమ విదేశీ పౌరులకు ఈ కేంద్రాలలో అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందించబడతాయని తెలిపారు.
పాకిస్తాన్ లో 1.7 మిలియన్ల ఆఫ్ఘన్ శరణార్థులు..
1979-1989 సోవియట్ ఆక్రమణ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుండిపారిపోయి వచ్చిన లక్షలాది మంది ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. వీరు సుమారుగా 1.7 మిలియన్ల మంది ఉన్నట్లు అంచనా. అక్రమ వలసదారులకు, ముఖ్యంగా ఆఫ్ఘన్‌లకు అక్టోబర్ 31 గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం (OHCHR) పాకిస్తాన్ ప్రభుత్వం మానవ హక్కుల విపత్తును నివారించడానికి చాలా ఆలస్యం కాకముందే ఆఫ్ఘన్ జాతీయుల బలవంతంగా తిరిగి పంపడం నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ నిర్ణయాన్ని విమర్శించింది. దానిని పునరాలోచించాలని కోరింది
అయితే విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ సోమవారం మాట్లాడుతూ పాకిస్థాన్‌లో నివసిస్తున్న అక్రమ విదేశీయులందరికీ, వారి జాతీయత మరియు మూలం దేశంతో సంబంధం లేకుండా స్వదేశానికి పంపించే ప్రణాళిక వర్తిస్తుందని అన్నారు. ఈ నిర్ణయం పాకిస్థాన్ సార్వభౌమ దేశీయ చట్టాల అమలులో ఉంది మరియు వర్తించే అంతర్జాతీయ నిబంధనలు మరియు సూత్రాలకు అనుగుణంగా ఉందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.