Pakistan inflation:ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.
వినియోగదారుల సూచి ఈ ఏడాది ఏప్రిల్‌లో 36.4 శాతానికి ఎగబాకింది. 1964 తర్వాత ఇదే అత్యధికం. కాగా మంగళవారం నాడు పాకిస్తాన్ స్టాట్సిటిక్ డిపార్టుమెంటు గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి లో రిటైల్ ద్రవ్యోల్బణం 35.4 శాతంగా నమోదైంది. అయితే బ్లూమ్‌బర్గ్ సర్వే మాత్రం 37.2 శాతంగా అంచనా వేసింది. ఇక శ్రీలంక ద్రవ్యోల్బణం చూస్తే గత నెలలో 35.3 శాతంగా నమోదైంది. అదే పాకిస్తాన్‌లో 36.4 శాతంగా నమోదైంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ రూపాయి విషయానికి వస్తే ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా రికార్డుకు కెక్కింది. ఈ ఏడాది డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ విలువ 20 శాతం వరకు క్షీణించింది. దీంతో దిగుమతులు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి.
రూపాయి బలహీనపడ్డంతో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇక పాకిస్తాన్‌లో రవాణా చార్జీలు చూస్తే 56.8 శాతం పెరిగాయి. అదే ఆహార ద్రవ్యోల్బణం చూస్తే 48.1 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. దుస్తులు, ఫుట్‌వేర్ ధరలు 21.6 శాతం పెరిగితే, హౌసింగ్, నీరు, ఎలక్ర్టిటిసిటి చార్జీలు 16.9 శాతం వరకు పెరిగాయి. ఇక అసలు విషయానికి వస్తే రాబోయే రోజుల్లో నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ 6.5 బిలియన్ డాలర్ల రుణాలకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఐఎంఎఫ్ షరతులు అత్యంత కఠినంగా ఉంటాయి. తాజాగా ఐఎంఎఫ్ పన్నులు పెంచాలని, ఇంధన ధరలు పెంచాలని షరతు విధించింది. దీంతో దేశంలో నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ డిఫాల్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకోవడం తప్పనిసరి. దీంతో పాటు దిగుమతులు చేసుకున్న ఆహారం, ఇంధన బిల్లులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కాగా ఐఎంఎఫ్ ఖచ్చితమైన ఆర్థిక పరమైన హామీలు ఇస్తే కానీ రుణాలు మంజూరు చేయమని స్పష్టం చేసింది.
ఒక వైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గత నెలలో కీలక వడ్డీరేట్లు లేదా రెపో రేటు 21 శాతానికి పెంచేసింది. 1956 తర్వాత దేశంలో కీలక వడ్డీరేట్లు లేదా రెపో రేటు పెంచడం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్బణం పెరగడంతో సాధారణంగా ప్రతి దేశం సెంట్రల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు పెంచడం పరిపాటే. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే వారికి రుణాలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. గత ఏడాది భారీ వరదలకు పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయింది. అప్పటి నుంచి గాడిన పడ్డానికి నానా ఇబ్బందులు పడుతోంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు తదుపరి ద్రవ్యపరపతి సమీక్ష జూన్12న నిర్వహించనుంది. పెరిగిపోతున్న నిత్యావసర ధరలు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ వెంటనే దేశంలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రోడ్డపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.