Site icon Prime9

Pak Supreme Court: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Pak Supreme Court

Pak Supreme Court

Pak Supreme Court: మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆ దేశ సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం ఇమ్రాన్ ను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీలు లేదన్న కోర్టు.. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. అదే విధంగా ఇమ్రాన్ ఖాన్ ను శుక్రవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు కు హాజరు కావాలని.. ఆ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా వెళ్లాలని సూచించింది.

సైన్యంపై తీవ్ర ఆగ్రహం(Pak Supreme Court)

తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా కోర్టు ఆవరణలో ప్రవేశించి ఇమ్రాన్ ను అరెస్టు చేయడం కోర్టును ధిక్కారించడమే అని మండిపడింది. ఈ క్రమంలో ఇమ్రాన్‌ను గంటలోపల న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

అది కోర్టు ధిక్కరణే

‘కోర్టు ప్రాంగణంలోకి అక్రమంగా 90 మంది ప్రవేశిస్తే అప్పుడు న్యాయస్థానం మర్యాద ఏమవుతుంది..? కోర్టు లోపలే ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? అరెస్టుకు ముందు కోర్టు రిజిస్ట్రార్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు చేసే క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’ అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ ను పారామిలిటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఆయన్ను పాక్‌ రేంజర్లు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో పాటు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

 

 

Exit mobile version