Site icon Prime9

Malaysia: మలేషియాలో ముందుస్తు ఎన్నికలు

Malaysia

Malaysia

Malaysia: మలేషియాలో ఎన్నకల నగారా మోగింది. ఎన్నికల కమిషన్‌ వచ్చే నెల 19న జాతీయ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. వాస్తవానికి పార్లమెంటు కాలపరిమితి వచ్చే ఏడాది జులై వరకు ఉంది. అయితే యునైటెడ్‌ మలయా నేషనల్‌ ఆర్గనైజేషన్‌ అధికార పక్షానికి మద్దతు ఇస్తోంది. తక్షణమే ఎన్నికలు జరిపితే తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని పట్టుబట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే స్థానిక మలేషియన్లు తమకు అనుకూలంగా ఓట్లు వేస్తారని, తిరిగి అధికారంలోకి రావచ్చునని ధీమా వ్యక్తం చేస్తోంది. వచ్చే ఏడాది చివరి వరకు ఎదురుచూస్తే ప్రతిపక్షాలు బలోపేతం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ కుంగే పరిస్థితి ఉంటుందని .. ప్రతిపక్షాలకు అవకాశాలు మెరుగుపడి.. అధికార పక్షంపై వ్యతిరేకత పెరగవచ్చునని మిత్రపక్షమైన యునైటెడ్‌ మలయా నేషనల్‌ ఆర్గనైజేషన్‌ అంచనా వేసింది.

ఇదిలా ఉండగా ఎలక్షన్‌ కమిషన్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఘనీ సల్లేహా మాత్రం ఎన్నికల షెడ్యూలును ప్రకటించేశారు. అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి చివరి తేదీ నవంబర్‌ 5వ తేదీగా నిర్ణయించారు. ఇక నవంబర్‌ 19వ తేదీన ఎన్నికలు కాబట్టి రాజకీయ పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అతి తక్కువ సమయం లభిస్తుంది. కేవలం రెండు వారాలు మాత్రమే పార్టీలు ప్రచారం చేసుకోవడానికి గడువు ఉంటుంది. కాగా 21.17 మిలియన్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయన తెలిపారు. అదే సమయంలో అంటే నవంబర్‌ 19న మూడు రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికలు జరుగనున్నాయని ఆయన వెల్లడించారు.

మాజీ ప్రధానమంత్రి మహాతీర్‌ మహ్మద్‌ నేతృత్వంలో 2018లో ప్రభుత్వం ఏర్పడింది. అయితే రెండేళ్లయినా తిరకుండానే ఆయన పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు పోవడంతో మహాతీర్‌ ప్రభుత్వం కుప్పకూలింది. తిరిగి యుఎంఎన్‌ఓ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇక ఇస్మాయిలీ విషయానికి వస్తే గతేడాది ఆగస్టులో మలేషియా రాజు ఆయనను నియమించారు. 2018 ఎన్నికల తర్వాత మూడవప్రధానమంత్రిగా ఇస్మాయిలీ కొనసాగుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం నవంబర్‌ 19 తర్వాత కూడా కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం కొనసాగుతుందని చెబుతున్నారు.

Exit mobile version