Site icon Prime9

Israel – Hamas War : తీవ్ర ఉద్రిక్తంగా ఇజ్రాయెల్ – హమాస్ మిలిటెంట్ల యుద్ధం.. రాకెట్ల వర్షం

latest trending news about Israel - Hamas War

latest trending news about Israel - Hamas War

Israel – Hamas War : ఇజ్రాయెల్‌ లో ప్రస్తుతం భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు ఈరోజు ఉదయం నుంచే ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్‌ సహా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. హమాస్‌ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్‌ జిహాద్‌ గ్రూప్‌ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది.

గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్‌ చేసినట్లు ఇజ్రాయెల్ (Israel – Hamas War) ప్రభుత్వం పేర్కొంది.

తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్‌ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. ‘ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతి చోటా శత్రువులతో పోరాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. భద్రతాపరమైన సూచనలను పాటించండి’ అని మంత్రి తెలిపారు. అటు హమాస్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ ‘ఐరన్‌ స్వార్డ్స్‌’ను ప్రారంభించింది. గాజాలోని హమాస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ (Israel – Hamas War) దాడి చేసిందని పాలస్తీనా ఆరోపించింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

Exit mobile version