Site icon Prime9

Jack Ma’s Tour: పాకిస్థాన్ లో హాట్ టాపిక్ గా మారిన జాక్ మా రహస్య పర్యటన

Jack Ma

Jack Ma

Jack Ma’s Tour: చైనీస్‌ బిలియనీర్‌ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నేపాల్‌ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్‌గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్‌ప్రెస్‌ ట్రైబ్యూన్‌ వెల్లడించింది.

జాక్‌ మా గత నెల 30వ తేదీన జెట్‌ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేట్‌ విమానంలో పాకిస్తాన్‌ నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఆయన రాకతో పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున ఊహాగానాల వెల్లువెత్తాయని ఎక్స్‌ప్రెస్‌ ట్రైబ్యూన్‌ న్యూస్‌పేపర్‌ వెల్లడించింది. కాగా బోర్డు ఆఫ్‌ ఇన్వెస్టెమెంట్‌ మాజీ చైర్మన్‌ ముహమ్మద్‌ అజ్‌ఫర్‌ ఎహెషాన్‌ మాత్రం జాక్‌ మా లాహోర్‌లో ఈ నెల 29న ప్రత్యేక విమానంలో దిగారని… ఇక్కడ 23 గంటల పాటు గడిపారని చెప్పారు. తన పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారు. జాక్‌ మా ప్రభుత్వ అధికారులతో కానీ, మీడియాతో కానీ కలవకుండా తప్పించుకు తిరిగారు. ప్రైవేట్‌ లోకేషన్‌లో గడిపిన ఆయన ఈ నెల 30న దేశం నుంచి వెళ్లిపోయారు. అయితే ఇక్కడి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆయన పర్యటన అత్యంత గోప్యంగా ఉంచారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆయన ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు మాత్రం వినవస్తున్నాయని ఎహెషాన్‌ అన్నారు.

జాక్ మా బృందంలో ఏడుగురు వ్యాపారవేత్తలు..(Jack Ma’s Tour)

జాక్ మాతో పాటు పాకిస్తాన్‌ వచ్చిన బృందంలో మొత్తం ఏడుగురు వ్యాపారవేత్తలున్నారు. వారిలో ఐదుగురు చైనీయులు కాగా.. ఒకరు డ్యానిష్‌, ఒక అమెరికాకు చెందిన వారు అని చెబుతున్నారు. వీరంతా నేపాల్‌ నుంచి పాకిస్తాన్‌కు హాంకాంగ్‌కు చెందిన జెట్‌ ఏవియేషన్‌కు చెందిన విమానంలో వచ్చారు. మా తన పర్యటనలో ఇక్కడ పలువురు వ్యాపారవేత్తలను కలిశారని షోషల్‌ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో వ్యాపారావకాశాల గురించి అధ్యయనం చేయడానికి వచ్చారని చెబుతున్నారు. మాతన పర్యటనలో దేశంలోని పలు ట్రేడ్‌ సెంటర్లలో పర్యటించారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన అధికారులతో ఆయన ముచ్చటించారు. అయితే ఆయన ఏ వ్యాపారాలపై మొగ్గు చూపారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఎహెషాన్‌ మాత్రం జాక్‌ మా పర్యటన కేవలం ఆయన వ్యక్తిగతమన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆయన పర్యటన గురించి ఇక్కడి చైనా రాయబార కర్యాలయానికి కూడా తెలియకపోవడం గమనార్హం. ఆయన వ్యక్తిగత పర్యటన అయినా.. ఆయన పాక్‌ గడ్డపై అడుగుపెట్టారని బాహ్యప్రపంచానికి తెలిస్తే దేశంలో పర్యాటక రంగం కాస్తా పుంజుకొనే అవకాశం ఉందని ఇక్కడి వాణిజ్య వేత్తలు చెబుతున్నారు. పాకిస్తాన్‌ అధికారులు మా పర్యటనను చక్కగా వినియోగించాల్సిందని పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ద్వారా ఓ ప్రకటన ఇప్పించినా దేశానికి ప్రయోజనం కలిగేదని చెబుతున్నారు. మా రాకతో పాకిస్తాన్‌ ఐటి రంగం పుంజుకుంటుందని ఇక్కడి వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar